కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : ఈ రెండే కీలకం..

5 Apr, 2018 08:58 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లు, దళితుల అంశాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. మే 12న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన వర్గాలకు సంబంధించిన అంశాలు పెనుప్రభావం చూపనున్నాయి. లింగాయత్‌లకు మైనారిటీ హోదాను మత నేతలు ఆమోదించరని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టంపై సుప్రీం తీర్పు నేపథ్యంలో దళిత సంఘాల ఆందోళన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఈ రెండు అంశాలపై తాజా పరిణామాలతో దళితులు, లింగాయత్‌ల మద్దతు కాంగ్రెస్‌కు లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా..వీటిపై ప్రజలకు ఎవరు దీటుగా వివరించగలరో వారికి అనుకూలంగా ఆయా వర్గాల మద్దతు అందివస్తుందని మరికొందరు సామాజిక విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు.

లింగాయత్‌లలో ఉన్న 99 ఉప కులాలతో కూడిన వారంతా నూతన మతంగా ఆవిర్భవించడానికి బీజేపీ మద్దతు ఇవ్వదని వీరశైవ లింగాయత్‌ మఠాలకు చెందిన 100 మందికి పైగా మత నేతలతో ఇటీవల సమావేశమైన సందర్భంగా అమిత్‌ షా స్పష్టం చేశారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదాను ఎవరు కోరారని ఆయన ప్రశ్నించారు. అయితే బీజేపీకి మద్దతు ఇస్తూ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా పరిగణించాలని కోరేవారంతా ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు దృష్టిసారిస్తారని ప్రముఖ సామాజిక విశ్లేషకులు, రచయిత చంద్రశేఖర్‌ పాటిల్‌ పేర్కొన్నారు. అయితే లింగాయత్‌ల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

లింగాయత్‌లకు మైనారిటీ హోదా కట్టబెడుతూ సీఎం సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపిస్తోంది. కర్ణాటక సీఎం అభ్యర్ధిగా లింగాయత్‌ వర్గానికి చెందిన బీఎస్‌ యడ్యూరప్పను బీజేపీ ప్రకటించడంతో వారి మద్దతు తమ పార్టీకే ఉంటుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులపై దళిత సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. సుప్రీం ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్ధానం దిగిరాకపోవడంపై దళిత సంఘాల ఆగ్రహం నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామం బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు