అన్నాడీఎంకేతో చర్చలకు చెన్నై చేరుకున్న పీయూష్‌ గోయల్‌

19 Feb, 2019 11:30 IST|Sakshi

చెన్నై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగాలని భావిస్తున్న అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, అన్నాడీఎంకే నేతలతో గత రెండువారాలుగా సంప్రదింపులు జరుపుతున్నారు. అయినప్పటికీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో.. మంగళవారం ఆయన అన్నాడీఎంకే నేతలతో చర్చించడానికి చెన్నై చేరుకున్నారు. పీయూష్‌ గోయల్‌ రాకతో కూటమిలో బీజేపీకి కేటాయించే సీట్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేనతో పొత్తును ఖరారు చేసుకుని మంచి జోష్‌ మీదున్న కమల దళం.. తమిళనాడులో అన్నా డీఎంకేతో కలిసి మోజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని వ్యుహరచన చేస్తోంది.

కొంగు బెల్ట్‌లో సీట్ల కేటాయింపుపై బీజేపీ పట్టుబడుతుండగా.. అందుకు అన్నాడీఎంకే ససేమిరా అంటుంది. కూటమిలోని మరో పార్టీతో కలిపి బీజేపీకి ఏడు లేదా ఎనిమిది సీట్లు మాత్రమే ఇస్తామని అన్నాడీఎంకే చెబుతోంది. 2014 ఎన్నికల్లో.. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గానూ..  అన్నాడీఎంకే 37 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో అప్పటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే, యూపీఏలో చేరిన సంగతి తెలిసిందే.

అన్నాడీఎంకే కూటమిలోకి పీఎంకే
మరోవైపు పీఎంకే, అన్నాడీఎంకే కూటమిలో చేరింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్పం నేతృత్వంలోని అన్నాడీఎంకేతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తులో భాగంగా 7 స్థానాలకు పీఎంకే ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులో 21 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పీఎంకే మద్దతు ఇవ్వనుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా