శరద్‌ పవార్‌ క్షమించేశారు!!

27 Nov, 2019 13:04 IST|Sakshi

ముంబై: ఎన్సీపీ రెబల్‌ నేత, శరద్‌ పవార్‌ అన్న కొడుకు అజిత్‌ పవార్‌ ఎట్టకేలకు మౌనం వీడారు. తాను ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, ఎన్సీపీతోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ‘నేను పార్టీని ఎప్పుడూ వీడలేదు. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారా? అలాంటిదేమీ లేదు కదా. మీడియా నా విషయంలో తప్పుగా కథనాలు రాసింది. వాటిపై సరైన సమయంలో స్పందిస్తాను’ అని అజిత్‌ బుధవారం మీడియాకు తెలిపారు.

సోదరుడిని ఆలింగనం చేసుకున్న సుప్రియా
పార్టీ అధినేత శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా అజిత్‌ పవార్‌ తిరుగుబాటు లేవనెత్తిన సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శరద్‌ సిద్ధమవుతుండగా అనూహ్యంగా చివరినిమిషంలో అజిత్‌ ప్లేటు ఫిరాయించి బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ ఇచ్చి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్‌ పవార్‌కే పూర్తి అండగా నిలువడం.. తన వర్గం ఎమ్మెల్యేలు కూడా ఆయనకు హ్యాండ్‌ ఇవ్వడంతో అజిత్‌ వెనుకకు తగ్గారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కూడా దిగిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్‌ తిరిగి ఎన్సీపీ గూటికే చేరుకున్నారు. ఈ తిరుగుబాటు విషయంలో పవార్‌ కుటుంబంలో తలెత్తిన విభేదాలు కూడా సమసిపోయినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్‌ను సుప్రియా సూలె ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. తద్వారా తమ మధ్య విభేదాలు లేవని చాటారు.
చదవండి: అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా

క్షమించేసిన శరద్‌ పవార్‌!
తిరుగుబాటు లేవనెత్తి బీజేపీకి సపోర్ట్‌ చేసిన అజిత్‌ పవార్‌ను పార్టీ అధినేత శరద్‌ పవార్‌ క్షమించేశారట. ఈ విషయాన్ని ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ మీడియాతో తెలిపారు. ‘చివర్లో అజిత్‌ తన తప్పు తాను తెలుసుకున్నారు. తప్పు చేసినట్టు అంగీకరించారు. ఇది కుటుంబ వ్యవహారం. పవార్‌ సాహిబ్‌ అజిత్‌ను క్షమించారు. ఆయన పార్టీలోనే ఉన్నారు. పార్టీలో ఆయన స్థానం ఏమాత్రం మారలేదు’ అని నవాబ్‌ మాలిక్‌ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు