బీజేపీకి చుక్కలు చూపిస్తున్న శివసేన

28 Oct, 2019 11:21 IST|Sakshi

ముంబై : హరియాణాలో జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీకి.. మహారాష్ట్రలో మాత్రం శివసేన చుక్కలు చూపిస్తోంది. బీజేపీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆధ్వర్యంలో శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ సోమవారం నాడు రెండు పార్టీలు వేర్వేరుగా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారిని కలవడానికి నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా శివసేన పార్టీ నాయకుడు దివాకర్‌ రౌత్‌ ఉదయం 10. 30 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను కలిశారు. సేన నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన దివాకర్‌... పార్టీ తరపున గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపామని, తమ మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఈ భేటీ తర్వాత బీజేపీ నాయకులు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా గవర్నర్‌ను కలిసి చర్చించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా గవర్నర్‌ను కేవలం మర్యాద పూర్వకంగా కలుస్తున్నట్లు రెండు పార్టీలు చెప్తుండడం కొసమెరుపు.

కాగా అక్టోబర్ 21న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహ కూటమికి మెజారిటీ సాధించినప్పటికీ, శివసేన అధినాయకత్వం ముఖ్యమంత్రి పదవికి 50:50 ఫార్ములా డిమాండ్‌ను తేవడంతో.. బీజేపీ అధినాయకత్వం ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికలు ముందు చెప్పినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటులో 50-50 ఫార్ములా అనుసరించాలని, మంత్రి పదవులు సైతం సమానంగా ఇవ్వాలని శివసేన వాదిస్తోంది. దీంతో బీజేపీ అధినాయకత్వం నేడు శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రేతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌డీఏ భాగస్వామి అయిన ఆర్‌పీఐ అధినేత రామ్‌దాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

50:50 ఫార్ములా పై ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల పాటు ఆదిత్య ఠాక్రే డిప్యూటీ సీఎంగా ఉండే ఆఫర్‌కు శివసేన సమ్మతం తెలపాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని కోరారు. రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న వివాదాలకు త్వరలోనే ముగింపు పలికి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు ముందు చెప్పినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటులో 50-50 ఫార్ములా అనుసరించాలని, మంత్రి పదవులు సైతం సమానంగా ఇవ్వాలని శివసేన వాదిస్తోంది. అలా కానీ పక్షంలో రిమోట్‌ తమ దగ్గర ఉందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు చెబుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా