పోలవరానికి పునాది వేసింది వైఎస్సే

30 Apr, 2018 03:13 IST|Sakshi

అబద్ధాలు చెప్పటానికి వెంకన్నను సాక్షిగా వాడుకోవద్దు

తిరుపతిలో ‘సత్యమేవ జయతే’ పేరుతో బీజేపీ నేతల సమావేశం

చంద్రబాబుకు పది ప్రశ్నలు సంధించిన బీజేపీ నేతలు

సాక్షి, తిరుపతి: పోలవరం ప్రాజెక్ట్‌కు పునాది వేసింది నాటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి అని బీజేపీ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబుకు పోలవరంపై మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు ఏనాడూ పోలవరం గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతి విధానాలను ఎండగడుతూ ‘సత్యమేవ జయతే’ అంటూ తిరుపతిలోని ఒక ప్రయివేటు హోటల్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం కేంద్రం రూ.1,500 కోట్లు ఇచ్చినా చంద్రబాబు మాత్రం కేవలం తాత్కాలిక భవనం మాత్రమే కట్టారన్నారు. అసలు డిజైన్లే సిద్ధమవ్వని రాజధానికి ఏ ప్రాతిపదికన నిధులు కేటాయించాలని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు.  

చంద్రబాబూ ఈ 10 ప్రశ్నలకు జవాబులు చెప్పగలవా?
- పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ముంపు మండలాలను ఏపీలో కలపడం నమ్మకద్రోహమా?
- రాష్ట్రానికి ప్యాకేజీ కింద రూ.16వేల కోట్లు ఇచ్చినా మీరు తీసుకోకపోవడం నిజం కాదా?
- రెవెన్యూ లోటులో మీ వాగ్దానాలైన రైతు రుణమాఫీ, డిస్కం అప్పులు, పింఛన్లు కలపడం నిజం కాదా?
- హోదా తప్ప అన్ని హామీలు కేంద్రం అమలు చేసింది నిజం కాదా? 
- డీపీఆర్‌ లేకుండా రాజధాని కోసం రూ.1500 కోట్లు ఇచ్చి మరో 1000 కోట్లు ఇస్తామని చెప్పలేదా?
- పదేళ్లలో ఏర్పాటు చేయాల్సిన 11 విద్యాసంస్థలను నాలుగేళ్లలో ఏర్పాటు చేసింది నిజంకాదా?
- చట్టంలో లేని 50కిపైగా విద్యాసంస్థలు, రక్షణ శాఖ ప్రాజెక్ట్‌లు, పరిశోధనా సంస్థలు, ఇతర పరిశ్రమలు ఇవ్వడం వాస్తవం కాదా?
- రాష్ట్రాన్ని 24/7 విద్యుత్‌ సరఫరా చేయడం, దేశంలో ఏడో వంతు జాతీయ రహదారులు రాష్ట్రానికి కేటాయించటం, పెట్రోలియం రంగంలో రూ.లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులు ఇవ్వటం, జాతీయ జలమార్గ రవాణావ్యవస్థ ఏర్పాటు చేయటం నమ్మకద్రోహమా?
- ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా గ్రాంట్లు మంజూరు చేయడం నిజంకాదా?
- 4 స్మార్ట్‌సిటీలు, 33 అమృతనగరాలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులివ్వడం ద్రోహమా?

మరిన్ని వార్తలు