భగ్గుమంటున్న మిత్రపక్షాలు.. సోము వర్సెస్‌ బుద్ధా!

6 Mar, 2018 14:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. బీజేపీ, టీడీపీ నేతలు పరస్పరం పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీ సోము వీర్రాజు పచ్చ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. మోదీ మట్టి నీరు ఇచ్చారని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, మరి చంద్రబాబునాయుడు నదులు, చెరువుల నుంచి తెప్పించినవి గాడిద పాలా? అన్నది సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఒక పక్క చర్చలంటూ.. మరోపక్క మోదీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ ఏవిధంగా కేంద్రంపై పోరాటం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. మిత్రపక్షంగా ఉంటూ టీడీపీ బీజేపీని దెబ్బతీయాలని చూస్తోందని, ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. పీవీ నర్సింహారావు, వాజపేయి ప్రవేశ పెట్టిన పథకాలు చంద్రబాబు తనివి అని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. తమను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా టీడీపీ సోషల్ మీడియంలో పోస్టులు పెడుతోందని, మోదీని కించిపరిచేలా టీడీపీ నాయకులు హెడ్డింగ్‌లు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. అనాగరికంగా, జోకర్స్ తరహాలో టీడీపీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రిని అవమానపరిచేలా వ్యవహరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే జోన్ విశాఖపట్నానికి తెస్తామని చెప్పారు.

సోము వీర్రాజే గాడిద పాలు తాగుతాడేమో!
బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఇటు టీడీపీ నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. తాజాగా సోమువీర్రాజుపై బుద్ధా వెంకన్న ఫైర్‌ అయ్యారు. సోము వీర్రాజు ఈ రాష్టానికి చెందిన వ్యక్తిలా మాట్లాడటం లేదని అన్నారు. గత నాలుగేళ్లుగా కేంద్రం మాటలతో కాలయాపన చేస్తున్నా.. ఓర్పుతో నేర్పుతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారని చెప్పుకొచ్చారు. సోము వీర్రాజు గాడిద పాలు తాగుతాడేమోనని అనుమానంగా ఉందని, గాడిద పాలు తాగే వారికే గాడిద పాల గురించి ఆలోచన వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటివరకు మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి సహనంతో ఉంటున్నామని, సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. సోము వీర్రాజు తన నోరును కేంద్రం వద్ద ఉపయోగిస్తే బాగుంటుందన్నారు. బీజేపీ ఇలాగే మాట్లాడితే నియోజకవర్గాల్లో కూడా తిరిగే పరిస్థితి ఉండదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఏపీకి జరిగిన అన్యాయంపై సానుభూతి చూపిస్తుంటే.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రంపై కక్ష కట్టినట్లు మాట్లాడాతున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు