35ఏ ఆర్టికల్‌ ఏం చెబుతోంది

5 Aug, 2019 12:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుకు తీర్మానం ప్రవేశ పెట్టింది. ఆ  వెంటనే ఆర్టికల్‌ 35ఏ రద్దుకు కూడా తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రకటన చేయగానే విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. విపక్షాల ఆందోళన మధ్యనే అమిత్‌ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 35ఏ ఈ ఆర్టికల్‌ జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది. 

(చదవండి : సంచలన నిర్ణయం ఆర్టికల్‌ 370 రద్దు)

35ఏ ఆర్టికల్‌ ఏం చెబుతోంది
జమ్ముకశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు? అన్న దానిని 35ఏ ఆర్టికల్‌ నిర్వచిస్తుంది. వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది. 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్‌–35ఏను చేర్చారు. 35ఏ ప్రకారం..
1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి ఆర్టికల్‌ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చవచ్చు. కశ్మీరు మహిళ ఇతర రాష్ట్రాల వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. ఆమెకు ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండడానికి వీల్లేదు. ఆమె పిల్లలకు కూడా ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికేట్‌ ఇ‍వ్వరు.

(చదవండి : ఆర్టికల్‌ 370 పూర్తి స్వరూపం)

ఎలా వచ్చింది
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత షేక్‌ అబ్దుల్లా, అప్పటి ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో డిల్లీలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించడం కోసం చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుంది. ఈ నిబంధనల్నే 1954 మే14న రాష్ట్ర పతి ఉత్తర్వు ద్వారా ఆర్టికల్‌ 35ఏ కింద చేర్చారు.

మరిన్ని వార్తలు