రజనీ, కమల్‌ను నమ్ముకుంటే భవిష్యత్‌ ఉండదు..!

23 Aug, 2018 12:35 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీ అక్కడ పాగా వేయాలని చూస్తోంది. అధికార అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కొందరు, లేదు డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని మరికొందరు గతంలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా.. సినీ స్టార్లు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లు కూడా తమిళ రాజకీయాల్లోకి దూకిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రజనీకాంత్‌ లేదా కమల్‌ హాసన్‌ పార్టీలతో జతకట్టనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.

సొంతంగా ప్రయత్నిస్తే కనీస ఓటు బ్యాంక్‌ అయినా సాధించవచ్చనీ, రజనీ.. కమల్‌ పార్టీలతో పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని మీడియాకు వెల్లడించారు. ఎవరినో నమ్మి ముందుకెళ్తే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సినీస్టార్ల రాజకీయాలపై బీజేపీ కార్యవర్గ సమావేశంలో చర్చించాలని సూచించారు. కరునానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌కే పార్టీని నడిపించే సమర్థత ఉందని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు