సునీల్‌ దేవ్‌ధర్‌ ట్వీట్‌ ; త్రిపురలో కలకలం

10 Mar, 2018 16:57 IST|Sakshi

అగర్తలా : త్రిపుర అభివృద్ధిబాటలో మాణిక్‌ సర్కార్‌ను కూడా కలుపుకొని వెళతామంటూనే.. ఆయనను ఇరుకునపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ! కాషాయదళం విజయానికి కారకుడైన సునీల్‌ దేవ్‌ధర్‌ శనివారం పేల్చిన ఓ ట్వీట్‌.. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘‘త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌కు నాదొక విన్నపం.. అధికారిక నివాసాల్లోకి చేరబోయేముందు అక్కడి సెప్టిక్‌ ట్యాంకులను ఓ సారి శ్రుభ్రం చేయించండి. గతంలో మాణిక్‌ సర్కార్‌ నివాసంలో మహిళ అస్తిపంజరం లభించిన అనుభవం దృష్ట్యా మీరీ పని తప్పక చెయ్యాలి..’ అని దేవ్‌ధర్‌ కామెంట్‌ చేశారు.

సీఎం నివాసంలో అస్తిపంజరమా? : అగర్తలాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మాణిక్‌ సర్కార్‌ 1998 నుంచి మొన్నటిదాకా ఉన్నారు. కాగా, 2005 జనవరి4న ఆ అధికారిక నివాసంలోని సెప్టిక్‌ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం బయటపడటం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. సెప్టిక్‌ ట్యాంకును శుభ్రం చేయడానికి వచ్చిన మున్సిపల్‌ సిబ్బంది దానిని గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మాణిక్‌ సర్కార్‌ కేసును సీఐడీకి అప్పగించారు. ఆ తర్వాత అది సీబీఐకి బదిలీ అయింది. 13ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఇంకా కొలిక్కిరాకపోవడంతో పలు విమర్శలకు తావిచ్చినట్లైంది. ‘ఇది మాణిక్‌ నియంత పాలనకు నిదర్శనమని’ సీపీఎం ప్రత్యర్థులు ఆరోపిస్తారు. ఇప్పుడు ఉన్నపళంగా సునీల్‌ దేవ్‌ధర్‌ ‘అస్తి పంజరం’ ఉదంతాన్ని కోట్‌ చేస్తూ ట్వీట్‌ చేయడం వ్యూహంలో భాగమా, లేక యాదృశ్చికమా తెలియాల్సిఉంది.

ఇంతకీ ఆ స్కెలిటన్‌ ఎవరిది? : సీఎం నివాసంలోని సెప్టిక్‌ ట్యాంక్‌లో తేలిన అస్తిపంజరం ఎవరిదనేదానిపై త్రిపురలో భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. నేపాల్‌కు చెందిన పని అమ్మాయిని.. సీఎం సిబ్బందిలో ఒకరు లేదా కొందరు అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని నాటి కాంగ్రెస్‌ నేత సమీర్‌ రాజన్‌ బర్మన్‌ ఆరోపించారు. హత్యాచారం కేసును తొక్కిపెట్టేక్రమంలో మృతురాలి కుటుంబాన్ని బలవంతంగా నేపాల్‌కు పంపించేశారని ఆయన పేర్కొన్నారు. మాణిక్‌ సర్కార్‌పై దినేశ్‌ కాంజీ అనే రచయిత రాసిన ‘మాణిక్‌ సర్కార్‌ : ది రియల్‌ అండ్‌ వర్చువల్‌’ అనే పుస్తకంలోనూ అస్తిపంజరం వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘‘అప్పట్లో జాతీయ స్థాయి మీడియాలో సైతం చర్చనీయాంశమైన ఈ కేసులో బర్మన్‌(కాంగ్రెస్‌ నేత) ఆరోపణలను ఏఒక్కరూ పట్టించుకోకపోవడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంద’ని రచయిత రాసుకొచ్చారు. దేవ్‌ధర్‌ తాజా ట్వీట్‌పై సీపీఎం శ్రేణులు ఇంకా స్పందించాల్సిఉంది.

>
మరిన్ని వార్తలు