‘తక్కువ సమయం’ సహేతుకమే

19 May, 2018 05:52 IST|Sakshi

కర్ణాటకలో బలపరీక్షకు సుప్రీం గడువును స్వాగతించిన నిపుణులు

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పును న్యాయ నిపుణులు స్వాగతించారు. ప్రొటెం స్పీకర్‌ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు సహేతుకం, సమర్థనీయమైనవి, దీంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై అనుమానాలు నివృత్తి అవుతాయని సీనియర్‌ లాయర్లు రాకేశ్‌ ద్వివేది, అజిత్‌ సిన్హా, వికాస్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. బలపరీక్షకు కోర్టు కాల పరిమితి విధించడంలో తప్పు లేదని అజిత్‌ అన్నారు. ప్రమాణ స్వీకారాన్ని కోర్టు వాయిదా వేసి ఉండాల్సిందన్న వికాస్‌..బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సబబేనన్నారు. ‘బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సమంజసమే. గోవా, ఉత్తరాఖండ్‌లో ఇలాగే జరిగింది. ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేలు ఫిరాయించే ముప్పుంది. ఇప్పటికే రెండ్రోజులు లేటైంది’ అని ద్వివేది అన్నారు. ద్వివేదితో అజిత్‌ ఏకీభవించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల పందేరానికి తెరతీసినట్లవుతుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై స్పందిస్తూ..ఆ నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌దే అని ద్వివేది అన్నారు. 

>
మరిన్ని వార్తలు