2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్‌-10 జడ్జ్‌మెంట్స్‌

24 Dec, 2023 15:49 IST|Sakshi

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ ఏడాది కీలక తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్ణయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు.. మోదీసర్కార్‌కు బిగ్‌ బూస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్‌ 10 జడ్జ్‌మెంట్స్‌ ఒకసారి చూద్దాం..

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌-370 రద్దుపై.. 2023 డిసెంబర్‌ 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్‌ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వాదనలతో పూర్తిస్థాయిలో ఏకీభవించింది సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఆర్టికల్‌ 370 రద్దును సవాల్ చేస్తూ దాదాపు 23 పిటిషన్లపై 16 రోజులపాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ఆర్థికశాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డీమోనిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేస్తూ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. ఏడేళ్ల తర్వాత 2023లో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దును సమర్థించింది. ఈ మేరకు 4-1 తేడాతో మెజార్టీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ BV నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకించారు.

ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో.. కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టంచేసింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా.. ఎన్నికల కమిషనర్ల అప్పాయింట్‌మెంట్స్‌కు సంబంధించిన సవరణ బిల్లును.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుకు తెచ్చింది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నేతతో కూడిన ప్యానెల్‌.. సీఈసీ, ఈసీలను ఎంపికే చేసేలా 1991 నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది. 

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిపోర్ట్‌ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదికతోపాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. షార్ట్ సెల్లింగ్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీచేసింది. 

విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది.విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని.. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా..విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలనఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. 

వివాహ వ్యవస్థ, విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో ఆరు నెలల కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. 6 నెలల సమయం వద్దని.. విడాకులు వెంటనే జారీచేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.


స్వలింగ సంపర్కలు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2023 అక్టోబర్‌లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. 21 పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్‌ DY.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 3-2 తేడాతో తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంట్‌కే ఉందని స్పష్టం చేసింది.

జల్లికట్టు, కంబల. ఎద్దులబండి పందాల వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోవలేమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎద్దుల బండి పోటీలను అనుమతిస్తూ.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్ల దాఖలయ్యాయి. వీటిని విచారించింది సర్వోన్నత న్యాయస్థానం. సంప్రదాయ క్రీడలు మన సంస్కృతిలో భాగమని.. వాటికి అటంకం కలిగించలేమని తేల్చిచెప్పింది.

ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్‌ జడ్జ్‌మెంట్స్‌

  • ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చిన సుప్రీంకోర్టు
  • డీమోనిటైజేషన్‌పై ఏడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
  • పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం
  • సీఈసీ, ఈసీల నియామకానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ
  • సీజేఐ స్థానంలో కేబినెట్‌ మంత్రిని చేర్చిన కేంద్రప్రభుత్వం
  • విదేశీ రిపోర్ట్‌ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు సరికాదన్న సుప్రీం
  • విద్వేషపూరిత ప్రసంగాలను తీవ్రమైన నేరంగా పేర్కొన్న సుప్రీంకోర్టు
  • విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు
  • ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. వెంటనే విడాకులు
  • స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం నిరాకరణ
  • 3-2 తేడాతో తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం
  • జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు
>
మరిన్ని వార్తలు