టీడీపీ మొక్కుబడి దీక్షలు   

21 Apr, 2018 08:39 IST|Sakshi
మధ్యాహ్నం 12 గంటలకే ఏలూరులో దీక్షా శిబిరం వద్ద ఖాళీగా ఉన్న కుర్చీలు

జిల్లాలో స్పందన కరువు

పలు బస్సులలో అమరావతికి జనాల తరలింపు

ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో చేపట్టిన దీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల మంత్రులు ఎమ్మెల్యేలు దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలు మొక్కుబడిగా సాగాయి. ఉదయం ఏడుగంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ సాగాల్సి ఉండగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి ఐదు గంటలకు ముగించేశారు.

జిల్లా కేంద్రంలో జరిగిన దీక్షకు మంత్రి జవహర్‌ వచ్చేసరికి దీక్షా శిబిరం ఖాళీగా దర్శనమిచ్చింది. జిల్లాలో ఎక్కడా కూడా ఈ దీక్షలకు ప్రజల నుంచి మద్దతు లభించలేదు. కార్యకర్తలను, డ్వాక్రా మహిళలను తీసుకువచ్చి కూర్చోపెట్టే ప్రయత్నం చేసినా వారు కూడా ఎక్కువ సేపు టీడీపీ మొక్కుబడి దీక్షలు

ఉండకుండా వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకే దీక్ష శిబిరాలు సగానికి పైగా ఖాళీ అయిపోయాయి. విజయవాడలో జరిగిన ముఖ్యమంత్రి దీక్షకు జిల్లా నుంచి 169 బస్సుల్లో కార్యకర్తలను, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలను తరలించారు. పెళ్లిళ్ల సీజన్‌  కావడం, విద్యార్థుల పరీక్షలతో ప్రజలు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎమ్మెల్యేలు ప్రధాన రోడ్లను ఒకవైపు మూసివేసి రోడ్డుపై దీక్షలకు దిగడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. తణుకు బస్‌ డిపో పరిధిలో మొత్తం 78 బస్సులకుగాను, 27 బస్సులను అమరావతి చంద్రబాబు దీక్షా శిబిరానికి తరలించారు. ఒక పక్క పెళ్ళిళ్ల సీజన్‌ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రోడ్డుపై కోర్టు ఎదురుగా శిబిరం ఏర్పాటు చేశారు. ఒకవైపు రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. నిడదవోలు ఆర్‌టీసీ డిపోలో 36 బస్సులకుగాను 14 బస్సులు అమరావతి దీక్షా శిబిరానికి తరలించారు.

దీంతో జంగారెడ్డిగూడెం, నర్సాపురం, రాజమండ్రి ఏరియాలకు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో పాటిమీద సెంటర్‌లో ధర్మపోరాట దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పార్టీ నాయకులు ఒక రోడ్డును బ్లాక్‌ చేసి దీక్షా శిబిరం చేయడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.

తాడేపల్లిగూడెం  డిపోకు 74 బస్సులుండగా దానిలో 28 బస్సులు ధర్మదీక్షా శిబిరానికి తరలించారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు తాడేపల్లిగూడెం– భీమవరం వెళ్ళేందుకు ఇబ్బందులు పడ్డారు. జంగారెడ్డిగూడెం డిపోకు 80 బస్సులున్నాయి. 21 బస్సులను విజయవాడ పంపగా, ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడం వల్ల విజయవాడ సర్వీసులను నిలిపివేశారు.

దీంతో విజయవాడ వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడ్డారు. ఏలూరు డిపోలో మొత్తం 146 బస్సులుండగా వాటిలో 109 పల్లె వెలుగు బస్సులున్నాయి. వీటిలో 30 బస్సులను మూడు దఫాలుగా ధర్మపోరాట దీక్షకు తరలిం చారు.

ఈ కారణంగా వివిధ రూట్లల్లో రెండు, మూడుసార్లు తిరగాల్సిన బస్సులను ఒక్కసారికే పరిమితం చేయగా సమయానికి బస్సులందక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరం డిపో నుంచి 30 బస్సులు ధర్మపోరాటదీక్షకు తరలించారు.

దీనివల్ల  పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నర్సాపురం రూట్లల్లో సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏలూరు జిల్లా కేంద్రంలో మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్‌ జవహర్, ఎంపీలు సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్‌ నూర్జహాన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలుగు జాతి జోలికి వస్తే ఎవరైనా మాడిమసైపోతారని, న్యాయంగా పోరాటం చేస్తున్న తెలుగుజాతిని అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్రానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.      

మరిన్ని వార్తలు