కోడెల శివప్రసాదరావు కన్నుమూత

16 Sep, 2019 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. ఆయన 1947, మే 2న గుంటూరులోని కండ్లకుంట గ్రామంలో జన్మించారు. కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్‌ విజయలక్ష్మీ ఉన్నారు.

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం గమనార్హం. కొడుకు శివరాంతో గొడవ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారనే కథనాలు వెలువడుతున్నాయి. వృత్తిరిత్యా డాక్టర్‌ అయిన కోడెల 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  గత టీడీపీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన కోడెల.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. కోడెల ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, ఎన్టీఆర్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా, హోంమంత్రిగా సేవలందించారు. కోడెల అనుమానాస్పద మృతి కారణంగా గుంటూరు జిల్లా నరసారావుపేట డివిజన్‌లో 144 సెక్షన్‌ విధించారు. ముందుజాగ్రత్తగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్టు గుంటూరు రూరల్‌ ఎస్పీ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
(చదవండి : సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!)

కేసీఆర్‌ సంతాపం..
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు.

ఉపరాష్ట్రపతి విచారం..
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు