113 ఏళ్ల చెత్త రికార్డును బ్రేక్‌ చేశారు..!

16 Sep, 2019 12:44 IST|Sakshi

లండన్‌:  తాజా యాషెస్‌ సిరీస్‌లో వందేళ్లకు పైగా ఉన్న చెత్త రికార్డు బ్రేక్‌ అయ్యింది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన యాషెస్‌ సిరీస్‌ 2-2తో సమంగా ముగిసినా ఇరు జట్ల ఓపెనర్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సిరీస్‌లో ఆసీస్‌-ఇంగ్లండ్‌ ఓపెనర్లు నమోదు చేసిన సగటు 12.55. ఆదివారం చివరి రోజు ఆటలో ఆసీస్‌ ఓపెనర్లు మార్కస్‌ హారిస్‌(9), డేవిడ్‌ వార్నర్‌(11) లు  విఫలమయ్యారు. దాంతో 113 ఏళ్ల చెత్త రికార్డులో భాగమయ్యారు. అంతకుముందు ఐదు అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్ల ఓపెనర్ల చెత్త రికార్డు సగటు 14.16 గా ఉండేది. 1906లో దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ రికార్డు నమోదైంది. ప్రస్తుతం దాన్ని బ్రేక్‌ చేశారు ఆసీస్‌-ఇంగ్లండ్‌ ఓపెనర్లు.

ఆదివారం ముగిసిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 399 పరుగుల టార్గెట్‌ను  నిర్దేశించింది. రెండో  ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 329 పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఓవరాల్‌గా 398 పరుగుల ఆధిక్యం  లభించింది. అయితే ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఆసీస్‌ ఓపెనర్లను ఆదిలోనే బ్రాడ్‌ పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్‌ పట్టుబిగించింది. కాగా, మాథ్యూ వేడ్‌(117) సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో సిరీస్‌ సమం అయ్యింది. ఇలా ఒక యాషెస్‌ సిరీస్‌ సమం కావడం 47 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు