మాకు తెలియకుండా జన్మభూమి కమిటీలా?

17 Feb, 2018 10:59 IST|Sakshi
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు

ఎంపీడీవోపై మండిపడ్డ టీడీపీ ప్రజాప్రతినిధులు

పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరిక

మోపిదేవి(అవనిగడ్డ): వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాయని, టీడీపీకి చెందిన వారమైనా తమకు తెలియకుండా జన్మభూమి కమిటీలు వేసుకుని మాకు విలువలేకుండా చేస్తున్నారని పలువురు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మండల పరిషత్‌ సమావేశంలో స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో అధికారులు కంగుతిన్నారు. మండల పరిషత్‌ సమావేశంలో టీడీపీకి చెందిన వెంకటాపురం ఎంపీటీసీ తుమ్మా నాగమణి, సర్పంచ్‌ తుమ్మా వెంకటలక్ష్మీ అధికారుల తీరుపై మండిపడ్డారు. అర్హులందరికీ కాకుండా టీడీపీ వారికే పింఛన్లు, రుణాలు ఇవ్వమని జీవో ఏమైనా ఉందా అని ఎంపీడీవోని  ప్రశ్నించారు.

ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న తమకు తెలియకుండా జన్మభూమి  కమిటీలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. మాకు ప్రాధాన్యత ఇవ్వనపుడు ప్రయోజనం ఏమిటని, తమ పదవులకు  రాజీనామా చేస్తామని హెచ్చరించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ సందర్భంగా అధికారులు టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంపీపీ మోర్ల జయలక్ష్మీ పలుసార్లు ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ విషయమై జన్మభూమి  గ్రామసభను బహిష్కరించినా తమకు న్యాయం జరగలేదని వారు మండిపడ్డారు.  టీడీపీ ప్రారంభం నుంచి పార్టీలోనే ఉంటూ అభివృద్ధికి కృషిచేస్తే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి  వచ్చిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ తమకు తెలియకుండా జన్మభూమి కమిటీలు వేసి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జెడ్పీటీసీ ఎం. మల్లికార్జునరావు కల్పించుకుని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు నచ్చజెప్పడంతో టీడీపీ ప్రజాప్రతినిధులు శాంతించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా