రేవంత్‌ ఎఫెక్ట్‌.. టీటీడీపీ కీలక సమావేశం!

19 Oct, 2017 22:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ పార్టీ మారడంపై వస్తున్న వదంతులపై చర్చించేందుకు సమావేశం కావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం టీటీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డితో పాటు ఇంకా ఎవరైనా పార్టీని వీడనున్నారా అనే దానిపై ముఖ్యంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.

మరోవైపు బుధవారం రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడటం, ఏపీ మంత్రులు, నాయకులపై విమర్శలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తే.. ఆయన కాంగ్రెస్‌కు చేరువ కావడానికి మానసికంగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న వివరాల ప్రకారం కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా అదే బాటలో ఉన్నారని తెలిసింది. భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్‌ మారే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దాదాపు తెలంగాణ టీడీపీ ఖాళీ అయినట్లే అని బలమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత మోత్కుపల్లి వంటి నేతలే పార్టీలో మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని పార్టీ శ్రేణులు చెప్పినా చంద్రబాబు ఎల్‌.రమణనే అధ్యక్షుడిగా ప్రకటించడంతో పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆపై పార్టీలో ఎన్నో రాజకీయ సమీకరణాలు మారడంతో చివరకు టీటీడీపీనే ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందేమోనని పార్టీ అధిష్టానంలో కలవరం మొదలైంది.

>
మరిన్ని వార్తలు