Revanth Reddy Vs Akbaruddin: సీఎం రేవంత్‌ Vs అక్బరుద్దీన్‌.. మాటల యుద్ధం!

21 Dec, 2023 16:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడి చర్చ నడుస్తోంది. విద్యుత్‌ అప్పులపై అసెంబ్లీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. అలాగే, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. 

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..‘గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసే ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాల్లో ఎంఐఎం పాత్ర ఉంటుంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎంఐఎం పని చేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌ను, నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీఆర్‌ అలీకి వ్యతిరేకంగా ఎంఐఎం పనిచేసింది. కవ్వంపల్లి వంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకు తగదు. అక్బరుద్దీన్‌ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాత్రమే. ముస్లింలందరికీ నాయకుడు కాదు. 

బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మిత్రులే..
అన్ని విషయాలను సభ ముందు పెడితే అక్బరుద్దీన్‌ను అభినందిస్తాం. బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ మిత్రులమని కేసీఆర్‌ చెప్పారు. ఎంఐఎంకు కేసీఆర్‌ మిత్రుడు కావచ్చు. మోదీకి కూడా మద్దతు ఇవ్వొచ్చు. అది వాళ్ల ఇష్టం. అక్బరుద్దీన్‌ ఎంతసేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు. ఓల్డ్‌ సిటీ, ‍న్యూసిటీ అనే తేడా మాకు లేదు. అక్బరుద్దీన్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశాం. అక్బర్‌ అన్ని విషయాలు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్‌ అయి తొమ్మిది మంది చనిపోయారు. ఆ ఘటనలో ఏఈ ఫాతిమా చనిపోయింది. ఫాతిమా చనిపోతే ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదు. మైనార్టీలను ముఖ్యమంత్రులను, రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్‌ పార్టీనే’ అని అన్నారు. 

పవర్‌ పంచ్‌..
మరోవైపు విద్యుత్‌ అంశంపై సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ మొండి బకాయిల్లో గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్‌ సౌత్‌ టాప్‌లో ఉంది. సూర్యాపేట జిల్లాలోనూ రైతులు కరెంట్‌ కోసం ఆందోళన చేశారు. కేటీఆర్‌, హరీష్‌ రావు, ఎంఐఎం బాధ్యత తీసుకుని విద్యుత్‌ బకాయిలను క్లియర్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. 

అక్బరుద్దీన్‌ సీరియస్‌..
ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. మేం ఎవరికీ భయపడం. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. నిజామాబాద్‌లో ఎంఐఎం పోటీ చేసిందా అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎప్పుడు ఎక్కడా ఎలా పోటీ చేయాలో మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. మమ్మల్ని బీజేపీ బీ టీమ్‌ అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలిసి పనిచేయం. సీఎం రేవంత్‌కు ఛాలెంజ్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. మరోవైపు.. అక్బరుద్దీన్‌ మాట్లాడుతుండగా గందరగోళం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. 

భట్టి విక్రమార్క్‌ ఫైర్‌..
అనంతరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. నేను ఏం చెబుతున్నానో వినకుండా మాట్లాకండి. కొత్తవాళ్లు ఏదైనా మాట్లాడితే పెద్ద మనసుతో అర్థంచేసుకోవాలి. అక్బరుద్దీన్‌ అఖల్‌ ఉందా అని మాట్లాడటం సరికాదు. 

>
మరిన్ని వార్తలు