ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఘట్టం

25 Apr, 2019 10:44 IST|Sakshi

కొండమల్లేపల్లి (దేవరకొండ) : దేవరకొండ డివిజన్‌లో మే 6న జరగనున్న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. డివిజన్‌ పరిధిలోని పది జెడ్పీటీసీ స్థానాలకు మొత్తంగా 167, 109 ఎంపీటీసీ స్థానాలకు 1,104 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీఓ లింగ్యానాయక్‌ తెలిపారు. ఈనెల 22న ఎన్నికలకు       
సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. అదే రోజునుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి రెండు రోజులు నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగగా చివరి రోజు మాత్రం అత్యధికంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

డివిజన్‌ పరిధిలోని ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన స్వీకరణ కేంద్రాల్లో అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్లు సమర్పించారు. తొలిరోజు జెడ్పీటీసీ స్థానాలకు 3, ఎంపీటీసీ స్థానాలకు 66 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు జెడ్పీటీసీ స్థానాలకు 10, ఎంపీటీసీ స్థానాలకు 90 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండు రోజుల్లో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు పడడంతో నామినేషన్ల దాఖలు మందకొడదిగా సాగాయి. చివరి రోజు మాత్రం అత్యధికంగా జెడ్పీటీసీ స్థానాలకు 153, ఎంపీటీసీ స్థానాలకు 946 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం.

నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన జిల్లా సాధారణ ఎన్నికల అధికారి 
జిల్లా సాధారణ ఎన్నికల అధికారి చంపాలాల్‌ బుధవారం దేవరకొండ, కొండమల్లేపల్లి, గుర్రంపోడ్‌ మండలాల్లోని నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను దేవరకొండ ఆర్డీఓ లింగ్యానాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ, వివరాలను ఆయా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కోలాహలంగా నామినేషన్‌ కేంద్రాలు 
పెద్ద ఎత్తున మద్దతుదారులతో భారీ ర్యాలీలుగా అభ్యర్థులు రావడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు సైతం చివరి రోజు తమ మద్దతుదారులతో కలిసి పలు మండలాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. దేవరకొండలో కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌లు హాజరయ్యారు.

పోలీసుల బందోబస్తు
నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వాహనాల రాకపోకలను నిషేధించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులను అనుమతించారు. దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్‌ ఆధ్వర్యంలో పోలీసులు నా మినేషన్‌ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు