బీజేపీ ఘోర పరాభవానికి అదే కారణం!

31 May, 2018 14:59 IST|Sakshi

సాక్షి, పట్నా :  దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. అటు, బిహార్‌లోని జోకిహాట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌కుమార్‌ ప్రతిష్టాత్మకంగా భావించిన జోకిహాట్‌ బైపోల్స్‌లో అధికార పార్టీ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గంలో ఆర్జేడీ భారీ మెజారిటీతో గెలుపొందింది. దీంతో ఆర్జేడీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.

అదే కారణం..
ఎన్నికల ఫలితాలపై బీజేపీ మిత్రపక్షం జేడీయూ సీనియర్‌ నేత కేసీ త్యాగి ఘాటుగా వ్యాఖ్యానించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని, వరుసగా పెట్రో, డీజిల్‌ ధరలు పెరగడం.. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఒక కారణమని ఆయన విశ్లేషించారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

నితీశ్‌పై మండిపాటు..
తాజా ఉప ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో సీఎం నితీశ్‌కుమార్‌పై ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్‌ తనయుడు తేజస్వి యాదవ్‌ మండిపడ్డారు. జోకిహాట్‌లో జేడీఎస్‌కు వచ్చిన ఓట్లు తమ మెజారిటీ కన్నా తక్కువేనని అన్నారు. యూటర్న్‌ తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీశ్‌పై రాష్ట్ర ప్రజలు పత్రీకారం తీర్చుకున్నారని, అందుకు తాజా ఉప ఎన్నికలే నిదర్శనమని అన్నారు. కేంద్ర సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేసి.. తమ కుటుంబంపై ఉసిగొల్పుతున్నారని ఆయన మండిపడ్డారు. తమ కుటుంబాన్ని వేధిస్తున్న నితీశ్‌కు ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. 

>
మరిన్ని వార్తలు