పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలా?

5 Feb, 2019 13:43 IST|Sakshi
మాట్లాడుతున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, చిత్రంలో రాజారాం

మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం

అవినీతి జరగలేదని మీ భర్తపై ప్రమాణం చేస్తారా..

మంత్రి సునీతకుతోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్‌  

అనంతపురం: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన మంత్రి పరిటాల సునీతనే.. చట్టాన్ని ఉల్లంఘించేలా వ్యవహరించడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా...? అన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్‌ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నగరంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రికి హితవు పలికారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు–కుంకుమ’ కింద ఇస్తున్న డబ్బు కంటే ప్రభుత్వ  ప్రచారమే ఎక్కువగా ఉందన్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మంత్రి సునీత..తమ గ్రామం వస్తుందని తెలుసుకునే తోపుదుర్తి మహిళలు ఆమెను నిలదీయాలని రెండు రోజుల కిందటే నిర్ణయించుకున్నారన్నారు. ఇది గ్రహించిన మంత్రి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గ్రామాల్లోకి రానివ్వకుండా రాజకీయాలు చేసేది ఆడమగ కానివారేననీ, అదీ గతంలో ఎవరు... ఎక్కడ.... చేశారో వారికే తెలుసన్నారు. పదేళ్లలో మంత్రి సునీతను ఎన్నోమార్లు అడ్డుకున్నామనీ,  నేడు సమస్య వచ్చింది కాబట్టే మహిళలు తిరగబడ్డారన్నారు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా..?ప్రకాష్‌రెడ్డికి పోయేకాలం వచ్చిందని మాట్లాడతారా...? అని ప్రశ్నించారు. తాము ఎంతో సంస్కారవంతంగా మాట్లాడతామనీ, తమ కుటుంబం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మంత్రి సునీతకు పలు ప్రశ్నలు సంధించారు.

స్వచ్ఛభారత్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణాల్లో రాప్తాడు నియోజకవర్గంలోనే రూ. వందల కోట్ల అవినీతి జరిగలేదా...?  ఈ విషయంలో మహిళలను ఇబ్బంది పెట్టలేదా..? నిధులను మీ కార్యకర్తలు స్వాహా చేయలేదా..?  కాణిపాకం వినాయకుడి మీద లేదంటే నీ భర్త పరిటాల రవి మీద ప్రమాణం చేసి అవినీతి జరగలేదని చెబుతారా...?
రూ.వేల కోట్ల నిధులు ఉపాధి హామీ నిధులు నియోజకవర్గానికి వస్తే అందులో ఫారంపాండ్లకు నిధులు మళ్లించి జేసీబీలతో తవ్వించి, పాత వాటికి బిల్లులు చేసుకోలేదా..? నియోజకవర్గంలో 82 వేల మంది ఉపాధి కూలీల కడుపు కొట్టలేదా..? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయండి. విచారణకు ఆదేశించండి.  
మహిళలకు జరిగిన అన్యాయంపై కనీసం గొంతెత్తలేని మంత్రి ఈరోజు దమ్ముధైర్యం గురించి మాట్లాడతారా..? దమ్ము అనేది ప్రజలకు అండగా నిలబడడంలో ఉండాలి. వారు కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ఆదుకునే విషయంలో దమ్ముండాలి. ఇచ్చిన మాట నిలుపుకునే దానిలో దమ్ముండాలి. అలాంటి దమ్మున్న నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమేనని ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలి.. వచ్చిన తర్వాత దోచుకోవాలని ఆలోచించేది మీరు. రాజకీయాల పట్ల అవగాహన లేకపోతే పాఠాలు చెప్పించుకోండని మంత్రికి సూచించారు.
ఐదేళ్ల కరువుతో రైతులు విలవిల్లాడుతున్నా.. ఇన్సూరెన్స్‌ గురించి ఆలోచించారా..? ఇన్‌పుట్‌ సబ్సిడీ ఏమైంది..? జిల్లాలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ మనసు కరగలేదా..?
మంత్రిగా ఉంటూ కియా పరిశ్రమలో స్థానికులకు ఉపాధి   కల్పించే విషయమై మాట్లాడారా...? 3 వేలమంది ఉద్యోగులుంటే జిల్లాకు చెందిన వారికి 300 మందికైనా అవకాశం ఇప్పించారా...? జేజేలు పలికించుకోవాలంటే ముందుగా ప్రజల మన్నలు పొందాలని ప్రకాష్‌రెడ్డి హితవు పలికారు. ఈ విషయం మీ కుమారుడికి తెలియజెప్పండని సూచించారు.
25 ఏళ్లుగా మీ క్షుద్ర రాజకీయాలు చూసి ప్రజలు అలిసిపోయారనీ, అందుకే మార్పు కోసం ఎదురు చూస్తున్నారని ప్రకాష్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తున్నారనీ, రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు అండగా ఉంటామంటున్నామన్నారు. అందుకే ప్రజలు వైఎస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రాజారాం పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు