మోదీకి 10 వేల ​‘వందేమాతరం’ పోస్టుకార్డులు

4 Jun, 2019 17:57 IST|Sakshi

కోల్‌కతా :  బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోస్టు కార్డుల యుద్ధం కొనసాగుతోంది. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేసినందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పది లక్షల జైశ్రీరాం​ నినాదాలతో కూడిన పోస్టు కార్డులను పంపాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము కూడా ప్రధాని నరేంద్ర మోదీకి 10 వేల పోస్టుకార్డులు పంపుతామని టీఎంసీ కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ‘వందేమాతరం’ , ‘జై హింద్‌’,, జై బంగ్లా’  నినాదాలతో కూడిన 10 వేల పోస్ట్‌ కార్డులు ప్రధాని మోదీకి పంపారు. 

(చదవండి :  దీదీకి తప్పని జై శ్రీరాం సెగ..)

‘ బీజేపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దూషిస్తూ.. జైశ్రీరామ్‌ నినాదాలలతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఒకరి వాహనాన్ని అడ్డుకొని జైశ్రీరామ్‌ అనడం ఎంతవరకు సమంజసం?  బీజేపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలపై దాడులు చేస్తున్నారు. మేము వారిలా(బీజేపీ కార్యకర్తలు) ప్రవర్తించం. ప్రధానమంత్రి వాహనాన్ని అడ్డుకోబోము. కేవలం పోస్టుకార్డులతో మా నిరసనను తెలుపుతాం. వందేమాతరం, జై హింద్‌, జై బంగ్లా అనే నినాదాలు రాసిన 10వేల పోస్టు కార్డులను మోదీకి పంపుతాం’ అని టీఎంసీ నాయకురాలు దేబశ్రీ బెనర్జీ మీడియాకు తెలిపారు. 

 కాగా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 42 స్ధానాలకు గాను బీజేపీ తొలిసారిగా 18 స్ధానాల్లో గెలుపొంది పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ.. ఈ ఎన్నికల్లో 22 స్థానాలను మాత్రమే సాధించింది.

మరిన్ని వార్తలు