‘భూకంపం సృష్టిస్తా అన్నావ్.. ఏమైంది?’

18 Jun, 2018 17:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన, ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో రేజర్వేషన్లు ఇప్పిస్తామన్న కేసీఆర్‌ నాలుగేళ్లు అయినా ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. భూకంపం సృష్టిస్తా అన్న కేసీఆర్‌.. ఇపుడెందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్ల విషయంలో మోదీ అనుకూలంగా ఉన్నారని అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎం చెప్పినట్టు గుర్తుచేశారు. మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. పునర్విభజన బిల్లులో ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎందుకు మంజూరు చేయించలేదో సీఎం సమాధానం చెప్పాలన్నారు. గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ వ్యక్తిగత లాభం కోసమే తెలంగాణ సమాజానికి జరిగే అన్యాయంపై నోరు మెదపడం లేదన్నారు.

ఊహాగానాలు వద్దు
మరోవైపు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటిపై ఊహాగానాలు అక్కర లేదన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై రాహుల్‌తో చర్చించినట్టు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. పీసీసీ పదవుల కోసం తాను ఎలాంటి సిఫారసులు చేయలేదని స్పష్టం చేశారు.  టీపీసీసీ తరఫున సర్వే చేయిస్తున్నామని.. ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ బలాబలాలు ఎలా  ఉన్నాయో తెలుసుకుంటామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులపై కూడా సర్వే జరుగుతుందని కానీ సిట్టింగ్, సీనియర్ నాయకులు ఉన్నచోట సర్వే చేయించడం లేదని తెలిపారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టమని అధ్యక్షడు సూచింనట్టు ఉత్తమ్‌ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు