మరికొన్ని గంటల్లో 'ఈశాన్య' రాష్ట్రాల భవితవ్యం

3 Mar, 2018 01:14 IST|Sakshi

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

అగర్తల/కోహిమా/షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. నేడు(శనివారం) ఉదయం 8 గంటలకు మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాల వల్ల మూడింటిలోనూ 59 స్థానాలకే పోలింగ్‌ జరిగింది.

త్రిపుర, మేఘాలయలో అభ్యర్థుల మరణం కారణంగా ఒక్కో స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఇక నాగాలాండ్‌లో నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(ఎన్‌డీపీపీ) చీఫ్‌ నీఫి రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ తరపున 47 మంది పోటీలో ఉన్నారు. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీతో జత కట్టింది. ఇక్కడ ఎన్‌డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ 18 స్థానాల్లోనే బరిలో ఉంది.


కమలం వికసించేనా..?
త్రిపురలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వామపక్ష కూటమికి పరాభవం తప్పదని, ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో తేలింది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని పేర్కొంది. మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉంది. 2008లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా నాగాలాండ్‌లో నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) 2003 నుంచి అధికారంలో ఉంది. అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలోనూ విజయకేతనం ఎగురవేసి ఈశాన్య భారతంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది.  

మరిన్ని వార్తలు