ఉత్తమ్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

21 Oct, 2019 03:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ హుజూర్‌నగర్‌ రూరల్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి లిఖితపూర్వకంగా రెండు ఫిర్యాదులు చేశారు. ‘టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్‌ కోదాడవాసి. అతనికి ఓటుహక్కు కోదాడలోనే ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం ముగిశాక స్థానికేతరులు ఎన్నిక జరిగే నియోజకవర్గ పరిధిలో ఉండకూడదు. కానీ, ఈ విషయంలో హుజూర్‌నగర్‌లోనే మకాం వేసిన ఉత్తమ్‌.. నిబంధనలను ఉల్లంఘించారని మొదటి ఫిర్యాదులో ఆరోపించారు.

నిబంధనల ప్రకారం ప్రచారం 19వ తేదీ సాయంత్రం 5 గంటలకే ముగిసింది. ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు పెట్టరాదు. కానీ, ఉత్తమ్‌ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు’ అని రెండో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై సీఈసీ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ప్రెస్‌మీట్‌ పెట్టారని ఉత్తమ్‌పై కేసు నమోదు చేసినట్లు హుజూర్‌నగర్‌ ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన హుజూర్‌నగర్‌లో తన ఇంట్లో ప్రెస్‌మీట్‌ పెట్టి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అధికారి డాక్టర్‌ పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు