కారుకు గెలుపు‘బాట’!

31 Oct, 2018 03:07 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‘రీజినల్‌ రింగ్‌రోడ్డు’నినాదం 

ప్రతిపాదిత రింగ్‌రోడ్డు ప్రాంతంలోని 9 సీట్లలో గెలుపే లక్ష్యం 

గ్రేటర్‌ శివారుపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

సాక్షి, హైదరాబాద్‌ :  అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లలో గెలుపు లక్ష్యంగా ముందుకెళుతున్న టీఆర్‌ఎస్‌ ఒక్కో ప్రాంతానికి ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. నాలుగేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల వద్దకు వెళ్తున్న టీఆర్‌ఎస్‌... నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని సీట్లను గెలుచుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు జిల్లాల్లోని కీలకమైన 9 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ప్రపంచస్థాయి రహదారిగా ఉండే ఈ రీజినల్‌ రింగ్‌రోడ్డుతో తొమ్మిది నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చని టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఏర్పాటు కానుంది. 2014 ఎన్నికల్లో ఈ తొమ్మిది సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఆరు స్థానాల్లో గెలిచింది. కల్వకుర్తి, చేవెళ్ల స్థానాల్లో కాంగ్రెస్, ఇబ్రహీంపట్నంలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అనంతరం చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ రద్దయ్యేనాటికి ఒక్క కల్వకుర్తి మినహా మిగిలిన 8 సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నారు.  

ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌ వే 
హైదరాబాద్‌కు ప్రస్తుతమున్న ఔటర్‌ రింగురోడ్డుకు అవతల నిర్మించతలపెట్టిన రీజినల్‌ రింగు రోడ్డును సాధారణ రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) రూపకల్పన జరుగుతోంది. దేశ నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న ఔటర్‌ రింగు రోడ్డు భవిష్యత్‌ అవసరాలు తీర్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో మరో రీజనల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి–గజ్వేల్‌–చౌటుప్పల్‌–మాల్‌–కడ్తాల్‌–షాద్‌నగర్‌– చేవెళ్ల–కంది పట్టణాలను కలుపుతూ 500 అడుగుల వెడల్పుతో 338 కిలో మీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరగనుంది.

ముంబై–పుణే, అహ్మదాబాద్‌–వడోదర మధ్య ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేల కన్నా ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు మెరుగ్గా ఉండనుంది. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌ నగరాల రహదారులు అనుసంధానమయ్యే జంక్షన్లలో ప్రజల అవసరాల కోసం 500 ఎకరాల్లో పార్కింగ్, ఫుడ్‌ కోర్టులు, రెస్టురూమ్‌లు, పార్కులు, పిల్లలు ఆడుకునే స్థలాలు, షాపింగ్‌ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు ఇలా అన్నీ ఏర్పా టు చేయాలి. మొత్తంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు దేశం లోనే అతి గొప్ప రహదారిగా ఉండనుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే రాష్ట్రంలోని రవాణా వ్యవస్థలో అనూహ్య మార్పులు రానున్నాయి. ఎన్‌హెచ్‌ 9, ఎన్‌హెచ్‌ 7, ఎన్‌హెచ్‌ 202తో రీజినల్‌ రింగ్‌ రోడ్డు అనుసంధానం మరింత సులభతరం అవుతుంది.

భవిష్యత్తు అభివృద్ధి...
ప్రపంచ స్థాయి రహదారి నిర్మాణంతో గ్రేటర్‌లోని శివారు ప్రాంతాలకు కొత్త దశ రానుంది. పార్కింగ్, ఫుడ్‌కోర్టులు, రెస్టురూమ్‌లు, పార్కులు, పిల్లలు ఆడుకునే స్థలాలు, షాపింగ్‌ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు వంటి సేవారంగాల్లో స్థానిక యువతకు ఉపాధి కలగనుంది. రోడ్డు నిర్మాణానికి సమాంతరంగా ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి చెందనుంది. స్థానికుల భూములకు ధరలు పెరిగి వీరి ఆర్థిక పరిస్థితులు మారే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లోనూ రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంతో కలిగే అన్ని ప్రయోజనాలను ప్రజలకు వివరించడం వల్ల అన్ని సెగ్మెంట్లలో విజయం సాధించవచ్చనే ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉంది.

మరిన్ని వార్తలు