గులాబీ జోష్‌

9 Mar, 2019 11:26 IST|Sakshi
మల్కాజిగిరి సభలో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తున్న కేటీఆర్‌

మూడు పార్లమెంట్‌ స్థానాలపై టీఆర్‌ఎస్‌ నజర్‌

భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు

సన్నాహక సమావేశాలతో పొలిటికల్‌ హీట్‌

కేడర్‌లో సమరోత్సాహం నింపుతున్న కేటీఆర్‌

మల్కాజిగిరి సమావేశంలో గెలుపునకు దిశానిర్దేశం

సాక్షి,సిటీబ్యూరో/దుండిగల్‌: పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వేగం పెంచింది. పార్లమెంటరీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒకవైపు పొలిటికల్‌ హీట్‌ను పెంచుతూ.. మరోవైపు కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపుతున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులకు సరాసరి ఐదు లక్షల మెజార్టీ తగ్గకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. శుక్రవారం జరిగిన మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌.. పార్టీ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మనకు మనమే పోటీ అని, విపక్షాల నుంచిఎదురయ్యే పోటీ నామమాత్రమేనన్నారు. పార్టీ అధినేత ఖరారు చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీ సాధనే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఈ సభ విజయవంతం చేసేందుకు, భారీగా జన సమీకరణ చేసిన కార్మిక మంత్రి మల్లారెడ్డి, ముఖ్య నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డిలను కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

కాగా శనివారం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఆ పార్టీ యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13న సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని ఇంపీరియల్‌ గార్డెన్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సిద్ధమవుతున్నారు. గ్రేటర్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ వినూత్న కార్యాచరణ సిద్ధం చేసిన నేపథ్యంలో రాజధాని నగరాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా మలచాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన మల్కాజ్‌గిరితో పాటు సికింద్రాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రణాళికలు సిద్ధంచేయడం విశేషం. ఇక చేవెళ్లలోనూ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేలా చూసేందుకు క్యాడర్‌కు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతల భుజస్కందాలపై మోపారు.

సేఫ్‌ సిటీగా హైదరాబాద్‌..
హైదరాబాద్‌ నగరం అత్యంత సురక్షిత ప్రాంతంగా పేరు గాంచిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం షీ–టీమ్స్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వంటి కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. నగరంలో లా అండ్‌ ఆర్డర్‌ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని, కరెంట్‌ కష్టాలు ఉంటాయని ఎద్దేవా చేశారని, ఇప్పుడు ఆయనే కనిపించకుండా పోయారన్నారు. 

నీటి సమస్యకు చెక్‌..
నగరంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు అప్పటి మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా శ్రమించారని, రూ.4 వేల కోట్లను కేటాయించి మంచినీటి సదుపాయం కల్పించారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గుర్తు చేశారు. కేటీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపడుతోందన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పర్యటించిన కేటీఆర్‌ ఏకంగా 99 స్థానాలను గెలిపించారన్నారు. కార్మిక, శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ దివాళా కోరు పార్టీగా మిగిలిందని, దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానం తనకు రాజకీయ జన్మనిచ్చిందని, ఇక్కడ నిలిపే అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తానని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు