మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే..!

16 Nov, 2019 10:56 IST|Sakshi

సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఆసక్తి

ఆదిత్యా ఠాక్రేకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ అభ్యంతరం

నేడు గవర్నర్‌తో మూడు పార్టీల నేతలు భేటీ

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడంతో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మూడు పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించి... అంగీకారం తెలిపాయి. ఐదేళ్ల​ పాటు సీఎం పీఠం శివసేనకు అప్పగించి, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌, మంత్రి పదవులు చెరి సమానంగా పంచుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మూడు పార్టీల నేతలు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్‌ దానికి అంగీకారం తెలిపితే ఆదివారమే శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే సీఎం పీఠం సేనదే అని ఖరారైనా.. సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. శివసేన నేతలు తొలి నుంచి డిమాండ్‌ చేస్తున్నట్లు ఉద్దవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రేనే సీఎం అని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. (లైన్ క్లియర్.. శివసేనకే సీఎం పీఠం)

కానీ బీజేపీతో తెగదెంపుల అనంతరం రాజకీయ సమీకరణాలు చాలావరకు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే మరో వ్యక్తిని సీఎంగా నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిత్యాను సీఎం అభ్యర్థిగా ఎన్నుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజకీయాలు కొత్త కావడం, కనీస అనుభవం లేకపోవడం దానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం కావడంతో పాటు, ప్రభుత్వ ఏర్పాటు అనంతరం విపక్ష బీజేపీని సమర్థవంతగా ఎదుర్కోగల శక్తీ, సామర్థ్యాలు ఆదిత్యాకు లేవని ఓ వర్గం నేతల వాదన. అయితే శివసేన సీనియర్‌ నేతలైన శుభాష్‌ దేశాయ్‌, ప్రస్తుత పార్టీ పక్షనేత ఏక్‌నాథ్‌ షిండే పేర్లు కూడా ఇరు పార్టీల నేతలు పరిశీలించారు. కానీ వారెవ్వరూ సీఎం పీఠానికి సరిపోరని ఓ అంచనాకి వచ్చినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా బలమైన నేతనే సీఎంగా  ఎన్నుకోవాలని కనీస ఉమ్మడి ప్రణాళిక సందర్భంగా భేటీ అయిన మూడు పార్టీల నేతలు చర్చించారు.

అంతటి సమర్థవంతమైన శివసేనలో ఒక్క ఉద్ధవ్‌ ఠాక్రే తప్ప మరెవ్వరూ లేరని సేన అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం అభ్యర్థి అయితేనే తాము మద్దతు తెలుపుతామని ఎన్సీపీ, కాంగ్రెస్‌ షరతు విధించినట్లు ఓ నేత వెల్లడించారు. ఐదేళ్ల పాటు ఆయన మాత్రమే ఆ పదవిలో కొనసాగే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు భేటీ వివరాలను తెలిపారు. అలాగే ఆదిత్యాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని కూడా తెలిసింది. దీంతో ఇప్పటి వరకు  ప్రత్యక్ష ఎన్నికల్లో కనీసం పోటీ చేయని ఉద్ధవ్‌ నేరుగాసీఎం పీఠాన్ని అధిరోహించనున్నారని సేన వర్గాల సమాచారం. అయితే దీనిపై ఏ పార్టీత నేత కూడా బహిరంగ ప్రకటన చేయలేదు. గవర్నర్‌తో భేటీ అనంతరంమే పూర్తి వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. శనివారం సాయంత్రం సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతల భేటీ అనంతరం గవర్నర్‌తో సమావేశం కానున్నారు. దీని అనంతరం ఉమ్మడిగా కీలక ‍ ప్రకటన చేస్తారని సమాచారం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా