ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?

22 Sep, 2023 12:03 IST|Sakshi

ముంబయి: ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని సీనియర్ నాయకులు అజిత్ పవార్, శరద్ పవార్‌లు ప్రకటించినప్పటికీ ఇరుపక్షాల నుంచి ఇంకా విభజనకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. శరద్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేల పేర్లు పేర్కొంటూ స్పీకర్‌కు అజిత్ వర్గం ఫిర్యాదు చేసింది. మొదట అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా ఈ చర్యలకు పూనుకుంది. 

అనర్హత వేటు పిటిషన్‌లో శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్, జితేంద్ర అవద్, రోహిత్ పవార్, రాజేష్ తోపే, అనిల్ దేశ్‌ముఖ్, సందీప్ క్షీరసాగర్, మాన్‌సింగ్ నాయక్, ప్రజక్తా తాన్‌పురే, రవీంద్ర భూసార, బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. అనర్హత పిటిషన్ జాబితా నుంచి నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపేలను మినహాయించారు.

ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవిపై ఇప్పటికీ ఎలక్షన్‌ కమిషన్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అజిత్ వర్గం పిటిషన్‌పై అక్టోబర్ 6న ఇరువర్గాలను ఈసీ విచారణకు పిలిచింది. పార్టీ జాతీయాధ్యక్షున్ని తాము ఎన్నుకున్నామని అజిత్ వర్గం ఈసీకి పిటిషన్ దాఖలు చేసింది. 

అజిత్ పవార్ తిరుగుబాటుతో జులైలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. శివ సేన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అనంతరం తన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక రాలేదని ఇటీవల ఇరుపక్షాల నాయకులు చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  

ఇదీ చదవండి: చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు!

మరిన్ని వార్తలు