టీఆర్‌ఎస్‌పై అన్ని వర్గాల్లో తిరుగుబాటు

25 Sep, 2017 01:49 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల హామీల్లో విఫలమైన అధికార టీఆర్‌ఎస్‌పై అన్ని వర్గాల్లో తిరుగుబాటు మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు డి. శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, మల్లేశం, తాహెర్‌బిన్‌లతో కలసి ఆదివారం ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న మోసాలకు ఆ పార్టీ నేతలు, తెలంగాణ ఉద్యమకారులే ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు.

బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల విషయంలో టీఆర్‌ఎస్‌ అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌ దుయ్యబట్టారు. దళితుల హత్యలు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించడం, పోలీసుల లాఠిచార్జీ, థర్డ్‌ డిగ్రీ వేధింపులు, గిరిజన మహిళలను తాళ్లతో చెట్లకు కట్టేసి కొట్టడం, పంటలకు ధరలు ఇవ్వాలని అడిగినందుకు గిరిజన యువకుల చేతులకు బేడీలు వేయడం, మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసాలు వంటి ఎన్నో దారుణ చర్యలకు టీఆర్‌ఎస్‌ పాల్పడిందని ఆరోపించారు. వీటిపై ప్రజలు విసిగిపోయారని, తిరుగుబాటు తప్పదన్నారు.

‘కాళేశ్వరం’పై మా నివేదిక వచ్చాక వ్యూహం
కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌తోపాటు భూసేకరణ, అనుమతులు, ప్రజాభిప్రాయసేకరణ, అవినీతి, కమీషన్లు వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉత్తమ్‌ వెల్లడించారు. దీనిపై నివేదిక వచ్చాక ప్రాజెక్టు, పర్యావరణ అంశాలపై వ్యూహాన్ని ప్రకటిస్తామన్నారు.

సాగునీరు, రైతుల కోసం కాకుండా కేవలం కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులను ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. తాము సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని... ఆ పేరుతో జరుగుతున్న అవినీతి, చట్టవిరుద్ధ పనులనే వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో టీఆర్‌ఎస్‌ నేతలు కొందరితోనే సభలు నిర్వహించి బలవంతంగా అభిప్రాయ సేకరణ చేశారని విమర్శించారు.

మరిన్ని వార్తలు