నిధులు మళ్లిస్తున్నారు.. భూములు మార్చుకుంటున్నారు 

3 Dec, 2023 01:37 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు 

సీఈవో వికాస్‌రాజ్‌కు వినతిపత్రం ఇచ్చిన రేవంత్, ఉత్తమ్, యాష్కీ, పొంగులేటి తదితరులు  

కట్టడి చేయాలని ఈసీని కోరాం: ఉత్తమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు కింద పంపిణీ చేయాల్సిన నిధులను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారని, హైదరాబాద్‌ శివారు జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్‌ భూముల రికార్డులను మారుస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ కోరింది.

ఈ మేరకు ఆ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జి.నిరంజన్, అంజన్‌కుమార్‌ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, హర్కర వేణుగోపాల్, రోహిణ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ తదితరులు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలసి వినతిపత్రం అందజేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రైతుబంధు నిధుల పంపిణీ ఆగిపోయిందని, ఈ నేపథ్యంలో ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేల కోట్లను తమకు ఇష్టమైన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ వినతిపత్రంలో తెలిపారు. అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్‌ భూముల హక్కు రికార్డులను ధరణి పోర్టల్‌ ద్వారా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల బినామీల పేరిట మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ విషయాల్లో సరైన పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా కట్టడి చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు.  

నాలుగు అంశాలపై వినతిపత్రం ఇచ్చాం: ఉత్తమ్‌ 
సీఈవో వికాస్‌రాజ్‌ను కలసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు నిధుల మళ్లింపు, అసైన్డ్‌ భూముల రికార్డుల మార్పిడికి సంబంధించి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోయే ముందు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని సీఈఓకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. అలాగే తమ పార్టీ నుంచి గెలిచే వారి ఎలక్షన్‌ సర్టిఫికెట్లను చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లకు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరామని తెలిపారు.

పాతబస్తీలో రిగ్గింగ్‌ జరిగిందని, దీనికి సంబంధించి సీసీటీవీ రికార్డులున్నాయని, ఈ రికార్డుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని వెల్లడించా రు. ఈనెల 4వ తేదీన కేబినెట్‌ సమావేశం నిర్వహించాలన్న కేసీఆర్‌ నిర్ణయంపై స్పందిస్తూ, కేబినెట్‌ ఎందుకు పెడుతున్నారో తమకు తెలియదని, రాజీనామాను ఇచ్చేందుకు ఈ సమావేశం నిర్వహించి ఉండవచ్చని, విషయం తెలియకుండా మాట్లాడలేమని ఉత్తమ్‌ చెప్పారు.   

మరిన్ని వార్తలు