నేరం చేయకపోతే భయమెందుకు బాబు? 

8 Jan, 2019 04:37 IST|Sakshi
పార్లమెంటు ఆవరణలో గాంధీజీ విగ్రహం వద్ద ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిరసన

ఎన్‌ఐఏకు సహకరించవద్దని పోలీసులకెందుకు ఆదేశాలిచ్చావ్‌?

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ పార్లమెంటులో నిరసన  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంలో నీ ప్రమేయం లేకపోతే అంత భయమెందుకని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎన్‌ఐఏ విచారణకు సహకరించవద్దని పోలీసులకు ఎందుకు ఆదేశాలిచ్చావో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. ఎన్‌ఐఏ విచారణతో వాస్తవాలు బయటకొస్తాయన్న భయంతోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఐఏను అడ్డుకుంటున్న చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై కనీస గౌరవం లేదని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నాసిరకం పనులతో అవినీతిమయం చేసి ఏ ఒక్క నిర్వాసితుడికీ 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వనందుకు గిన్నిస్‌బుక్‌లో ఎక్కించారా? అని ఎద్దేవా చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారన్నారు.  

ఢిల్లీలో నేడు ‘అవినీతి చక్రవర్తి’ విడుదల..
గత నాలుగున్నరేళ్లుగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో వైఎస్సార్‌సీపీ రూపొందించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి పాల్గొంటారు.

పునరావాసం కల్పించింది 1,317 కుటుంబాలకే!
పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల నిర్వాసితులైన 56,495 ఎస్టీ కుటుంబాల్లో ఇప్పటి వరకు కేవలం 1,317 కుటుంబాలనే పునరావాస కాలనీలకు తరలించినట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన ఎస్టీ కుటుంబాలకు పునరావాసం కల్పించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నట్లు జాతీయ ఎస్టీ కమిషన్‌ రాష్ట్రపతికి సమర్పించిన నివేదికలో పేర్కొన్న విషయం వాస్తవమేనా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల నిర్వాసితులైన గిరిజనులు అన్న అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్‌ ఒక ప్రత్యేక నివేదిక రూపొందించిన విషయం వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. నిర్వాసితులైన గిరిజన కుటుంబాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం చేపట్టవలసిన కొన్ని ముఖ్యమైన చర్యలను ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందన్నారు. కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనల సడలింపు అంశాన్ని సమీక్షించి, పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నెలకొల్పిందని పర్యావరణ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ మహేష్‌ శర్మ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. సీఆర్‌జెడ్‌ కారణంగా కోస్తా ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తీర ప్రాంతం కలిగిన ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు.  

గొలగమూడి జంక్షన్‌ వద్ద ఫ్‌లైఓవర్‌  
జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–16లో కోల్‌కత్తా–చెన్నై రహదారులు కలిసే నెల్లూరు జిల్లాలో గొలగమూడి జంక్షన్‌ వద్ద ఫ్‌లైఓవర్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదనలు స్వీకరించిందని, అలాగే నెల్లూరు బైపాస్‌ ఎన్‌హెచ్‌–16వద్ద సర్వీస్‌ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ఉన్నట్టు కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే కడప–మైదుకూరు–కర్నూలు ఎన్‌హెచ్‌–18 పనులు ఈ ఏప్రిల్‌లోపు పూర్తవుతాయని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు