‘కిరీటాలు ఎక్కడ దొరుకుతాయో పోలీసులకు తెలుసు’

24 Apr, 2019 17:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. టీటీడీ బంగారం తరలింపుపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పాలనలో టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను, ఆ తర్వాత ముగ్గురు అర్చకులను తొలగించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించారు. ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈఓగా నియమించారు. దొంగతనం, దోపిడీ చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం ఇవన్నీ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. టీటీడీకి చెందిన బంగారం చెన్నై నుంచి తిరుపతి తరలించేటప్పుడు హైవేపై రాకుండా.. వేపం పట్టు అనే లోపలి రోడ్డు నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది?. గోవిందరాజస్వామి ఆలయంలోని కిరీటాలు చోరీ చేశారు.. ఇద్దరు జేబు దొంగలను పట్టుకుని కిరీటాలు వారే కాజేశారని మభ్యపెడుతున్నారు. వాళ్లు కిరీటాలను కరిగించారని చెబున్నారు. ఏ ఇంటిని సోదా చేస్తే కిరిటీలు దొరుకుతాయో పోలీసులకు తెలుసు. 

విజయవాడలో నలభై దేవాలయాలను చంద్రబాబు కూలగొట్టారు. వాటిని కట్టిస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకుంది లేదు. చంద్రబాబు హయంలో మసీదులు, చర్చిలను సైతం కూలగొట్టారు. దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు భయం లేకుండా పోయింది. టీటీడీ బంగారం తరలింపునకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నియమించిన కమిటీ నివేదిక సమర్పించాక.. అందులోని వివరాలను బయటపెట్టాలి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పైన కాంగ్రెస్‌ హయంలో పెట్టినవి దొంగ కేసులేనని తెలిపోయింది. ప్రజావేదికను పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం ఈసీ నిబంధనలకు వ్యతిరేకం. టీడీపీ నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పకుండా ఫిర్యాదు చేసితీరుతామ’ని తెలిపారు.

మరిన్ని వార్తలు