పోలింగ్‌ తగ్గెన్‌.. ఓటింగ్‌ ముగిసెన్‌

12 Apr, 2019 14:11 IST|Sakshi
ఎన్నికల అనంతరం ఈవీఎంలతో తిరిగొస్తున్న సిబ్బంది

సాక్షి, జగిత్యాల: లోక్‌సభ సమరం ముగిసింది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.04 శాతం పోలింగ్‌ నమోదైంది. గతంలో కంటే ఈసారి పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 77.61 శాతం నమోదైంది. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్‌ ముగిసే సమయానికి మొత్తం 62.53శాతం నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 69.20 శాతం, కోరుట్ల నియోజకవర్గంలో 68.85శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎండ తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే చాలా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.  

తగ్గిన ఓటింగ్‌ 
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 77.61 శాతం పోలింగ్‌ నమోదుకాగా ప్రస్తుతం 70.04 శాతానికి పరిమితమైంది. ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీలో 78.02శాతం ఓటింగ్‌ జరిగితే ఈసారి  62.53, కోరుట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో 75.45 శాతం, లోక్‌సభ ఎన్నికల్లో 68.85, జగిత్యాలలో 79.35 శాతం నుంచి 69.20 శాతానికి పడిపోయింది. తగ్గిన ఓటింగ్‌ శాతం ఎవరికి మేలు చేస్తుందనే చర్చ ఆసక్తిగా మారింది.  

మొరాయించిన ఈవీఎంలు 
జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మాక్‌పోలింగ్‌ నిర్వహణ జాప్యం కావడంతో పోలింగ్‌ సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. రాయికల్‌ మండలం మూటపల్లి, మైతాపూర్‌ బూత్‌ నంబరు 46, పెగడపల్లిలోని 262 పోలింగ్‌కేంద్రంలో, సారంగాపూర్‌తోపాటు కోనాపూర్‌ గ్రామాల్లో 9 గంటలకు పోలింగ్‌ మొదలైంది. కోరుట్ల మండలం పైడిమడుగులో 114 పోలింగ్‌కేంద్రం, కోరుట్లలోని 181 ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మల్లాపూర్‌తోపాటు రాఘవపేటలోని 84 పోలింగ్‌కేంద్రంలో, మల్లాపూర్‌ మండలం వెంకట్రావ్‌పేటలోని 59 పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సీజ్‌ చేశారు. జగిత్యాల మండలం ధరూర్‌లో గంట ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది.

జిల్లా కేంద్రంలోని 164 పోలింగ్‌కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక 9 గంటల తర్వాత పోలింగ్‌ ప్రారంభమైంది. లింగంపేటలో, మెట్‌పల్లిలోని 196 కేంద్రంతోపాటు కోరుట్లలోని కల్లూరు 141 కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్‌ మొదలైంది. జగిత్యాలలోని కొత్తవాడలో ప్రభుత్వ బాలికల పాఠశాల, జగిత్యాల మండలం కల్లెడ, పొరండ్ల గ్రామాల్లో పోలింగ్‌ ముగింపు సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్‌ జాప్యమైంది.  

కేంద్రాలు సందర్శించిన అభ్యర్థులు 
జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్‌ 192 పోలింగ్‌ కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవిత సందర్శించారు. గొల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ సందర్శించారు.   

ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం 
పోలింగ్‌ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాయి. పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను ఎన్నికల అధికారులు జిల్లా కేంద్రంలోని వీఆర్‌కే కళాశాలకు తరలించారు.  ఓటింగ్‌ ముగియడంతో నిజామాబాద్‌ స్థానం నుంచి బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పు డు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజా తీర్పు మే 23న వెలువడనుంది. 

మరిన్ని వార్తలు