విప్‌ల నియామకంపై టీడీపీలో అసంతృప్తి

19 Nov, 2017 10:22 IST|Sakshi
అనంతరంలో కేసీఆర్‌, కేశవ్ మంతనాలు (ఫైల్ ఫొటో‌)

కేసీఆర్‌ను కలిశారని  తిట్టిన పయ్యావులకు పదవా?

రెండు జిల్లాల వారికే ఎక్కువ పదవులపై ఆగ్రహం

అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు

సాక్షి, అమరావతి: శాసనసభ, శాసన మండలిలో చీఫ్‌ విప్‌లు, విప్‌ల నియామకంపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం రెండు, మూడు జిల్లాలకే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా తమను పట్టించుకోవడంలేదని ఈ పదవులను ఆశించి భంగపడ్డ నేతలు వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నడూలేని విధంగా విప్‌ పదవులు ఎక్కువ ఇచ్చినా కొన్ని జిల్లాలకే అవన్నీ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే కేసీఆర్‌తో మంతనాలు జరిపిన పయ్యావుల కేశవ్‌ తీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకే మండలి చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వడం, తెరవెనుక రాజకీయాలను తేటతెల్లం చేస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అసెంబ్లీలో ఇప్పటికే నలుగురు విప్‌లుండగా మరో ఇద్దరిని నియమించనున్నారు. ఈ రెండు పదవులు విశాఖ జిల్లాకే చెందిన గణబాబు (విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే), కిడారి సర్వేశ్వరరావు (అరకు ఎమ్మెల్యే)లకు ఇస్తుండడంపై టీడీపీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే జిల్లాకు చెందిన వారికి రెండు పదవులు ఎలా ఇస్తారని అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తమను కాదని వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన కిడారి సర్వేశ్వరరావుకు విప్‌ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బయట పార్టీ నుంచి వచ్చిన వారిని అందలమెక్కిస్తూ తమను పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.

ఒకే జిల్లాకు రెండు చీఫ్‌ విప్‌లా?
అసెంబ్లీ, మండలి చీఫ్‌ విప్‌ పదవులు రెండూ అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రఘునాథ్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌లకు ఇస్తుండడంపై సొంత పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక జిల్లాకు చెందిన వారికే రెండు ముఖ్యమైన పదవులు గతంలో ఎప్పుడూ ఇవ్వలేదని వాపోతున్నారు. అసెంబ్లీ చీఫ్‌విప్‌గా గతంలో అదే జిల్లాకు చెందిన కాల్వ శ్రీనివాసులు ఇచ్చారని, ఈసారి వేరే జిల్లా వారికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ అదే జిల్లా ఎమ్మెల్యేకు ఆ పదవి ఇవ్వడం ఏమిటని భంగపడ్డ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు చీఫ్‌విప్‌ పదవులతో పాటు అసెంబ్లీలో మరో విప్‌ యామినీ బాల కూడా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కావడం గమనార్హం.

నిరాశలో నేతలు...
అసెంబ్లీ చీఫ్‌ విప్‌ పదవి వస్తుందని ఆశించిన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిరాశకు లోనయ్యారు. మంత్రివర్గ విస్తరణలోనే తనకు అవకాశం వస్తుందని ఎదురు చూసినా చంద్రబాబు మొండిచేయి చూపడంతో అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసి కాపుల గొంతు కోశారని వ్యాఖ్యానించారు. ఈసారి చీఫ్‌ విప్‌ పదవైనా వస్తుందని ఆశించినా అదీ రాకపోవడంతో లోలోన రగిలిపోతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కాగిత వెంకట్రావు కూడా ఈ పదవిని ఆశించి భంగపడ్డారు. మండలి చీఫ్‌ విప్‌ పదవిపై వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఆశలు పెట్టుకున్నా ఆయనకు షాక్‌ ఇచ్చి పయ్యావులను నియమించాలని నిర్ణయించడం సరికాదనే వాదన టీడీపీలో వినిపిస్తోంది. పరిటాల సునీత కుమారుడి వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాసుకుపూసుకు తిరిగారని కేశవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయనకే చీఫ్‌ విప్‌ పదవి కట్టబెట్టడం ఏమిటని పార్టీలోని సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు