ఎస్పీ, బీఎస్పీ మధ్య మోదీ చిచ్చు!

6 May, 2019 16:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నాటి నుంచి విపక్షాల మహా కూటమిని మహా కలయిక అంటూ విమర్శిస్తూ వచ్చారు. ఇంతకాలం దోచుకున్న సొమ్మును కాపాడుకునేందుకు వారంతా ఒక్క చోట కూడారని కూడా ఆరోపిస్తూ వచ్చారు. గత వారం నుంచి ఆయన తన పంథా మార్చుకొని కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. 20 ఏళ్ల తర్వాత ఏకమైన బీఎస్పీ, ఎస్పీ పార్టీల మధ్య చిచ్చు రేపడమే ఆయన ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. సమాజ్‌వాది పార్టీ నాయకులు నిర్వహిస్తున్న ప్రచార వేదికలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆనందంగా పంచుకుంటున్నారని, ఈ విషయాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి కనీసం గుర్తించలేక పోతున్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తున్న చోట ఆ పార్టీకి ఎస్పీ మద్దతిచ్చేలా, ఎస్పీ పోటీ చేస్తున్న చోట కాంగ్రెస్‌ మద్దతిచ్చేలా వారి మధ్య లోపాయికారి ఒప్పందం కుదరిందనే అనుమానం తలెత్తాలని, తద్వారా ఎస్పీతో బీఎస్పీకి పొరపొచ్చాలు రావాలన్నది మోదీ ఎత్తుగడగా అర్థం అవుతోంది. 20 ఏళ్లపాటు ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యర్థులుగా కొనసాగిన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసేందుకు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో చేరాలనుకున్న కాంగ్రెస్‌కు పొత్తు పొసగలేదు. కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ విషయంలోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ మహా కూటమిలో చేరకపోయినప్పటికీ వాటి మధ్య ఎన్నికల అవగాహన ఉన్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి.

ఎస్పీ–బీజేపీ కూటమి ఓట్లను చీల్చకుండా, బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్న చోటనే కాంగ్రెస్‌ పోటీ పెడుతోందని, తద్వారా బీజేపీని ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించడమే వాటి మధ్య అవగాహన అంటూ వార్తలు వచ్చాయి. వీటిని తొలుత ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఖండించాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గత వారం ఎన్నికల ప్రచారంలో, విజయం సాధించడం లేదా బీజేపీ ఓట్లను కత్తిరించడం లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. దీనికి ఎస్పీ–బీఎస్పీల నుంచి ఖండన లేదంటే ఆమె వ్యాఖ్యల్లో నిజం ఉందని భావించాలి. ఇది గ్రహించే మోదీ, ఎస్పీ–బీఎస్పీ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం అవుతుంది.

ఎస్పీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌తో రాహుల్‌ గాంధీకి ఇప్పటికీ సత్సంబంధాలు ఉండడం, గత ఎన్నికల్లో ఇద్దరు కలిసి ‘యూపీకే లడ్కే’ అంటూ సంయుక్తంగా ప్రచారం కొనసాగించడం, ఉత్తరాది రాష్ట్రాల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి రాహుల్‌ గాంధీ ససేమిరా అనడం తదితర పరిణామాల నేపథ్యంలో మాయావతి మనస్సులో అనుమానపు బీజాలు నాటవచ్చని మోదీ భావించవచ్చు. నాయకుల మధ్య పొరపొచ్చాలు రాకపోయినా, పార్టీల కార్యకర్తలు, అభిమానుల మధ్య అనుమానాలు తలెత్తినా ఇరుపార్టీల మధ్య ఓట్ల బదిలి తగ్గుతుందన్న ఆశ కూడా ఉండవచ్చు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో ఓటర్ల నాడి ఎస్పీ–బీఎస్పీ కూటమికి అనుకూలంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. మొత్తంగా ఏడు విడతల పోలింగ్‌ పూర్తయి, ఫలితాలు ఏర్పడితేగానీ ఎవరి వ్యూహం పనిచేసిందో తేలిపోతుంది.

మరిన్ని వార్తలు