పరిశ్రమలకు ఇది గడ్డు కాలమన్నా..

26 Sep, 2018 03:13 IST|Sakshi
మంగళవారం విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం గాంధీనగర్‌లో కార్మికులు కోరడంతో వారితో సెల్ఫీ దిగుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన కార్మికులు

జూట్‌ మిల్లులు సంక్షోభంలో ఉన్నాయని ఆందోళన  

ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలకూ నోచుకోలేదని ఆవేదన 

అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు ఇవ్వడం లేదని వృద్ధులు కన్నీటిపర్యంతం 

అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. ఈ పాలనలో పరిశ్రమలు బతికి బట్ట కడతాయన్న నమ్మకం కుదరడం లేదు.. మా ప్రాం తంలోని జూట్‌ మిల్లులు సంక్షోభంలో ఉన్నాయి.. ఉపాధి కోల్పోతున్నాం.. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని మీరే ఆదుకోవాలన్నా..’ అని జూట్‌ మిల్లు కార్మికులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 270వ రోజు మంగళవారం వైఎస్‌ జగన్‌.. విజయనగరం జిల్లా శృంగవరపు కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని అడ్డూరివానిపాలెం వద్ద పాదయాత్రను ప్రారంభించి రంగరాయపురం వరకు కొనసాగించారు. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలుకుతూనే సమస్యలూ వివరించారు. విజయనగరం జిల్లాలో గోగునార ఉత్పత్తి ఎక్కువ. అందుకు తగినట్లుగా ఇక్కడ పరిశ్రమలు వెలిశాయి. వాటిలో వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, లక్షలాది మంది పరోక్షంగా జీవనోపాధి కలిగి ఉంటారు.

కొత్తవలసలో ప్రస్తుతం ఉన్న రెండు యూనిట్ల మిల్లులను విలీనం చేసే క్రమంలో కార్మికులు నష్ట పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఈ జిల్లాలో వేల సంఖ్యలో కార్మికులు జూట్‌ మిల్లుల్లో పని చేస్తున్నారని, వీటిని కాపాడటానికి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జూట్‌ మిల్లులకు రూ 3కే యూనిట్‌ విద్యుత్‌ ఇచ్చారని కార్మికులు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయని కొత్తవలస జూట్‌ మిల్లు వర్కర్ల యూనియన్‌ అధ్యక్షుడు కె.సురేష్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ జిల్లాలో మరో రెండు పెద్ద జూట్‌ మిల్లుల్లో కూడా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని మరి కొందరు కార్మికులు జననేత దృష్టికి తెచ్చారు. కొన్ని జూట్‌ మిల్లుల్లో ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలను కూడా కార్మికులకు వర్తింప జేయడం లేదన్నారు. మరికొన్ని చోట్ల రిటైర్‌ అయిన కార్మికులకు గ్రాట్యుటీ చెల్లింపును వాయిదా వేస్తున్నారని కార్మికులు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జిందాల్‌ ఫ్యాక్టరీలో కనీస వేతనాలు పెంచడంలో అన్యాయం జరుగుతోందని ఆ కంపెనీలో పని చేసే ఓ కార్మికుడు జగన్‌ దృష్టికి తెచ్చారు. 
 
పల్లెల్లో సందడే సందడి 
తమ గ్రామానికి వస్తున్న రాజన్న బిడ్డను చూసి పల్లెవాసులు పులకించిపోయారు. తమ అభిమాన నాయకుడు నడచి వస్తుండటంతో పరుగులు తీస్తూ ఆయన ఆడుగులో అడుగు వేశారు. పొలాల్లో పనుల్లో ఉన్నవారు, పరిశ్రమల్లో పని చేస్తున్న వారు జననేతకు ఎదురేగి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రస్తుత పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువుపెట్టారు. అన్ని అర్హతలున్నప్పటికీ పింఛన్లు, రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదని పులువురు వృద్ధులు కన్నీటి పర్యంతమయ్యారు. దారిపొడవునా పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో జగన్‌ వారితో మమేకమయ్యారు. వారు తన దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యనూ, ప్రతి ఫిర్యాదును ఓపిగ్గా విన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పరిమితులుండటంతో ఉన్నత విద్యకు వెళ్లలేక పోతున్నామని పలువురు విద్యార్థినులు ఆయన దృష్టికి తెచ్చారు. మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో అందరినీ ఆదుకుంటామని జననేత భరోసా ఇచ్చారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల తన ఇద్దరు మనవళ్లు ప్రయోజకులయ్యారని ఓ వృద్ధురాలు జగన్‌ను కలిసి ఆనందం వ్యక్తం చేసింది.  

మరిన్ని వార్తలు