పేరు మార్చుకున్న యడ్డీ.. మరి రాత మారుతుందా?

26 Jul, 2019 15:30 IST|Sakshi

యడియూరప్పగా పేరు మార్పు

సాక్షి, బెంగళూరు: ఆటలో అచ్చిరావడంలేదని ఆటగాళ్లు, సినిమాళ్లో కలిసి రావడంలేదని సినీ నటులు పేర్లు మార్చుకోవడం సహజంగా చూస్తూఉంటాం. తాజాగా  రాజకీయాల్లో తనకు అదృష్టం​​​​​ కలిసిరావడం లేదని భావించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పేరును మార్చుకున్నారు. నేడు సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి సలహా మేరకు ఆయన పేరు మార్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన పేరు (BS Yaddyurappa) అని ఉండగా.. తాజాగా యడియూరప్ప (BS Yadiyurappa)గా మార్చుకున్నారు. 2007లో తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన పేరులో మార్పులు చేసుకున్నారు. యడియూరప్ప(BS Yediyurappa)ను యడ్యూరప్ప( BS Yeddyurappa)గా మార్చుకున్నారు.

రాజకీయంగా ఆ సమయంలో కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కోవడంతో జ్యోతిష్కుడి సలహా ప్రకారం పేరులో అక్షరాలను మార్పు చేసుకున్నారు. కానీ ఆ ఫార్ములా వర్కవుట్‌ కాలేదని భావించిన యడ్డీ.. తాజాగా మళ్లీ పేరులో మార్పు చేశారు. అందుకే శుక్రవారం గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాకిచ్చిన లేఖలో తన పేరును తిరిగి యడియూరప్ప(Yediyurappa) అనే పేర్కొన్నారు. కొత్తపేరు తనను రాజకీయంగా ముందుకు తీసుకెళ్తుందని యడ్డీ గట్టిగా నమ్ముతున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సీఎంగా ప్రమాణం చేస్తుండగా.. ఈనెల 31న ఆయన బలపరీక్షను ఎదుర్కొనున్నారు. యడ్యూరప్ప ఇప్పటి వరకు మూడుసార్లు సీఎంగా ఎన్నిక కాగా.. ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కొనసాలేకపోయారు. ఆరోజు ప్రమాణం చేస్తే ఆయన నాలుగోసారిగా ఆ పదవీ బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది. మరి ఈసారైనా ఆయనకి అదృష్టం కలిసివస్తుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు