సీఎం పర్యటనతో ఒరిగేదేమి ఉండదు

16 Aug, 2018 14:22 IST|Sakshi
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల : జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  రెండు రోజుల పర్యటనతో ఒరిగేదేమి ఉండదని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సాయంత్రం స్థానిక వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ప్రజలను మాటలతో మోసం చేస్తున్నాడన్నారు. జిల్లాకు రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ, ఉర్దూ యూనివర్సిటీల విషయంలో మోసం చేశాడన్నారు. బాబు  25సార్లు జిల్లాకు వచ్చారని.. ఒక్క అభివృద్ధి కూడా చేయలేదన్నారు. ప్రతిసారి జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతానని మాటలు మాత్రం చెబుతాడని.. జిల్లా దాటిన తర్వాత ఆ విషయాన్ని తుంగలో తొక్కుతాడన్నారు.

దివంగత మహా నాయకుడు వైఎస్‌ఆర్‌ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కులనుంచి 44వేల క్యూసెక్కులకు పెంచి హంద్రీ–నీవా, గండికోట, పైడిపాలం ప్రాజెక్టు పనులను ఆయన హయాంలో 95శాతం పూర్తి చేశారన్నారు. ఆయన ప్రాజెక్టులు నిర్మిస్తే దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తే తామేదో నీళ్లు ఇచ్చామని ప్రతిసారి తన పర్యటనలో చంద్రబాబు ఊదరగొట్టడం ఆనవాయితీగా మారిందన్నారు. జిల్లాలోని రైతులకు రుణమాఫీ కాక, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం జిల్లాలోని టీడీపీ నాయకుల అంతర్గత కలహాలను పరిష్కరించేందుకే చంద్రబాబు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాదన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేశారు.

మరిన్ని వార్తలు