ఢిల్లీ పాలనపై మాదే అధికారం: కేంద్రం

23 Nov, 2017 03:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం కేవలం ఢిల్లీ వాసులదే కాదనీ, ఇది మొత్తం భారత ప్రజలందరికీ చెందుతుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఢిల్లీ పరిపాలనపై అక్కడి ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) ప్రభుత్వానికన్నా తమకే ఎక్కువ అధికారాలు ఉన్నాయంటూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో తన వాదనలు వినిపించింది. ఢిల్లీకి లెఫ్టినెంట్‌ గవర్నరే పరిపాలనాధిపతి అనీ, ముఖ్యమంత్రి కాదంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ అంశంపై విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది.

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మణీందర్‌ సింగ్‌ వాదిస్తూ ‘దేశ రాజధాని దేశ ప్రజలందరికీ చెందుతుంది. వారేమో (ఆప్‌) అక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటారు. మరి కేంద్రం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. ఢిల్లీ పూర్తిగా రాష్ట్రం కూడా కాదు. అది ఒక కేంద్ర పాలిత ప్రాంతమే. ఆ ప్రాంత పరిపాలనపై ఢిల్లీ శాసనసభకన్నా కేంద్రానికే ఎక్కువ అధికారాలుంటాయి. కేంద్రంతోపాటు శాసనసభకూ కూడా ఇక్కడి పాలన విషయంలో సమానాధికారాలు ఉంటాయనడం అప్రజాస్వామికం. ఇలాగైతే జనవరి 26న ఢిల్లీలో కవాతు జరగాలా లేదా అనేది కూడా వారే నిర్ణయిస్తామంటారేమో’ అని అన్నారు. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. 

>
మరిన్ని వార్తలు