అనకాపల్లిని జిల్లా చేస్తా: వైఎస్‌ జగన్‌

29 Aug, 2018 18:09 IST|Sakshi

సీఎం దళారిగా మారితే ఆదుకునేది ఎవరు?

మార్కెట్‌ బెల్లం హెరిటేజ్‌ బెల్లం ధరకు చాలా తేడా ఉంది

అనకాపల్లి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి, అనకాపల్లి : అధికారంలోకి రాగానే అనకాపల్లిని జిల్లా చేస్తానని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 249వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం విశాఖ జిల్లా అనకాపల్లి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’. అని తెలుపుతూ.. ప్రసంగం ప్రారంభించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

హెరిటేజ్‌లో బెల్లం 84..
‘అనకాపల్లి అంటే గుర్తుచ్చేది తియ్యటి బెల్లం. కానీ ఇది తయారుచేసే వారి జీవితాలు చేదయ్యాయి. అప్పులు తీర్చలేక రైతులు భూములు అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతోంది. రైతుల ఇబ్బందులతో అనకాపల్లికి వచ్చే బెల్లం ప్రతి ఏడాది తగ్గిపోతుంది. సీఎం చంద్రబాబు హెరిటేజ్‌ షాప్‌లో బెల్లం ధర 84 రూపాయలు. కానీ రైతులు తయారు చేసిన క్వింటాల్‌ బెల్లానికి రూ.2500 నుంచి 3వేలు పలకడం లేదు. మార్కెట్‌ బెల్లానికి, హెరిటేజ్‌ బెల్లం ధరకు చాలా తేడా ఉంది. సీఎం చంద్రబాబే దళారిగా మారితే రైతులను ఆదుకునేది ఎవరు? రాష్ట్రంలో చెరుకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను చంద్రబాబు మూసేయిస్తున్నారు. ఆయన బంధువు ఎంవీవీఎస్‌ మూర్తికి చక్కెర ఫ్యాక్టరీ కట్టబెట్టాలని  చూశారు.

వైఎస్సార్‌ ఆదుకున్నారు..
ఏటికొప్పాక ఫ్యాక్టరీని మళ్లీ నష్టాల్లో నెట్టే యత్నం చేస్తున్నారు. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ రూ.20 కోట్ల నష్టాల్లో ఉన్నప్పుడు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. బాబు సీఎం అయ్యాక మళ్లీ తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లింది. చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ రూ.100 కోట్ల నష్టాల్లో ఉంది. తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ రూ.40 కోట్ల నష్టాల్లో ఉంది. నాన్నగారి హయాంలో కార్మికులకు బోనస్‌ ఇచ్చిన పరిస్థితి చూశాం. కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఫ్యాక్టరీలు మూతబడటానికి సిద్దమయ్యాయంటే వ్యవస్థను ఎలా నాశనం చేస్తున్నాడో అర్థమవుతోంది. ఆయన పాలనలో ఉద్యోగాలురాక యువకులు, గిట్టుబాటు ధర లేక రైతన్నలు బాధపడుతున్నారు.

డెయిరీలు మూతపడ్డాయి..
చంద్రబాబు సీఎం అయ్యాక సహకార రంగంలోని డెయిరీలు మూతబడ్డాయి. ప్రయివేట్‌ రంగంలో ఉన్నడైరీలన్నీ కుమ్మక్కవుతాయి. రైతన్న దగ్గర లీటర్‌ పాలు 26 రూపాయలకు కొనుక్కుంటారు. ఆ లీటర్‌ పాలలోంచి వెన్నను తీసేసి ఇదే హెరిటేజ్‌ షాపుల్లో అర లీటర్‌ పాల ప్యాకెట్‌ను అవే 26 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న మాయజాలం. అన్ని సంస్థలు కుమ్మక్కై రేట్లు పెంచుతాయి. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వరు. సహకార సంఘంలో ఉన్న డైరీలు మూతబడుతాయి. విశాఖ డైరీ సహకార డైరీ కాకుండా ఓ కుటుంబం నడుపుతున్న డైరీగా మార్చేశారు.  

పేరుకే అనకాపల్లి ప్రభుత్వాస్పత్రి. 108 అంబులెన్స్‌లు మూడుంటే డ్రైవర్‌ ఒక్కడే ఉన్నాడు. మంత్రి యనమల దంతాల చికిత్సకు మూడు లక్షలంటా. అది రూ.10వేలల్లో పూర్తవుతుంది. పేదలు హైదరాబాద్‌లో వైద్యం చేసుకుంటే ఆరోగ్యశ్రీ చెల్లదంటారు. మంత్రికేమో బిల్లులు చెల్లిస్తారు. గ్రేటర్‌ విశాఖలో కలిశాక అనకాపల్లికి మేలు జరిగిందా? ఇంటి పన్ను, కరెంట్ చార్జీలు బాదుడు ఎక్కువైంది. అందరి దీవేనలు, దేవుని దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనకాపల్లిని జిల్లాగా చేస్తానని హామీ ఇస్తున్నాను. నాన్నగారి హయాంలో అనకాపల్లి నియోజకవర్గంలో 11వేల ఇళ్లుకట్టించారని ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. అనకాపల్లి సమీపంలోని సత్యనారయణపురంలో మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, వాటిని ప్రస్తుతం బలవంతంగా లాక్కుంటున్నారన్నా.. అని నాతో బాధపడ్డారు. వారందరికీ అక్కడ ఫ్లాట్స్‌ కడతారని మభ్యపెడుతున్నారు. 300 అడుగుల ఫ్లాట్‌ను వారికి అమ్ముతారంటా. వాటిని వద్దనకుండా తీసుకోండి. నవరత్నాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాం.

బీసీలపై ప్రేమ అంటారు..
అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు బీసీలపై ప్రేమ అంటారు. పేదలు, బీసీలపై ప్రేమ చూపించిన ఏకైక వ్యక్తి వైఎస్సారే. పేదల కోసం వైఎస్సార్‌ ఒక అడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా నేను రెండుడగులు ముందుకేస్తా. తొలి కార్యక్రమంగా ‘అమ్మ ఒడి’ చేపడతాం. విద్యార్థులు ఏది చదవాలంటే అది చదివండి. ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తా. చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్‌లో ఉంటే మెస్‌ ఛార్జీల కోసం ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం. అప్పుడే పేదవాడు అప్పులపాలు కాకుండా చదువుకునే పరిస్థితి ఉంటుంద’ని నవరత్నాల్లో కొన్నిటిని వైఎస్‌ జగన్‌ వివరించారు. మరో ఆరునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, మళ్లీ చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారని, మనస్సాక్షికి నచ్చినట్లు ఓటేయాలని ప్రజలను వైఎస్‌ జగన్‌ కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు