అవినీతి మంట అతడే గంటా

18 Sep, 2018 07:12 IST|Sakshi
బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్‌. చిత్రంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

మంత్రి మాయాజాలంపై నిప్పులు చెరిగిన జగన్‌

చప్పట్లతో మద్దతు తెలిపిన ప్రజలు

అలుపెరుగని బాటసారికి అడుగడుగునా బ్రహ్మరథం

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణానికి కేంద్రం భీమిలి నియోజకవర్గం. ఇక్కడ ప్రభుత్వ, ఎసైన్డ్, ఇనాం భూములను ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అండ్‌ కో ఏ స్థాయిలో దోచేశారో సిట్‌ విచారణ సమయంలోనే రాష్ట్రమొత్తం చూసింది. ఇప్పుడు ఆ భీమిలి నియోజకవర్గ పరిధిలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి గంటాపై నిప్పులుచెరిగారు. జిల్లాలో చివరి బహిరంగ సభ కావడంతో ఆనందపురం జనసంద్రమైంది. మార్కెట్‌ సెంటర్‌ మొదలుకుని జాతీయ రహదారి వరకు ఎటు చూసినా జనంతో కిక్కిసిరిపోయింది.

గంటా ఇలాకాలో జగన్‌ గంటానే లక్ష్యంగా చేసుకుని అరగంటకు పైగా మాటల తూటలు పేల్చడంతో ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించింది. గంటాతో పాటు ఆయన వియ్యంకుడు నారాయణ, చంద్రబాబు బంధువు గీతం మూర్తిపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో ఏ నాయకుడు మంత్రి గంటాను లక్ష్యంగా చేసుకుని ఇంత ఘాటైన విమర్శలు చేయ లేదని సభకు వచ్చిన ప్రజలు వ్యాఖ్యానించడం కన్పించింది. గంటా ప్రస్తావన వచ్చినప్పుడుల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబుకు అవినీతి అంబాసిడర్‌గా గంటా తయారయ్యారని, బాబు ట్రైనింగ్‌లో గంటా ఆరితేరిపోయారని, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు విశాఖ మహానగరాన్ని దోచుకుతిన్నారని జగన్‌ తనదైన శైలిలో సంధించిన వాగ్భాణాలు తూటాల్లా పేలాయి. భీమిలి, మధురవాడ, ఆనందపురం తహశీల్దార్‌ కార్యాలయాల్లో జరిగిన భూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు బారులు తీరారంటే ఇక్కడ ఏ స్థాయిలో భూకబ్జాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు. ఎమ్మార్వోలంతా ఇంద పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటే మంత్రి అండదండలు లేకుండా వారు చేయగలుగుతారా? అని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు నెల రోజుల్లో తెరిపిస్తానన్న జ్యూట్‌ మిల్లును నాలుగున్న రేళ్లయినా పట్టించుకోని గంటా ఇప్పుడు మిల్లుకు చెందిన 2 ఎకరాల గొడౌన్‌ స్థలాన్ని కొనుగోలు చేయించి వ్యాపారం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. తగరపు వలసలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ అని చెప్పి వేసిన శిలాఫలకాన్ని కూడా వెనక్కి తీసుకుపోయాడని విమర్శించారు. భీమిలిలో జెట్టీ, రైతు బజార్, గోస్తనిపై పాండ్రం గి వద్ద వంతెన, మూలకొద్దులో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంతో సహా ఎన్నో హామీలు ఇచ్చిన గంటా నేడు మర్చిపోయారన్నారు. 2019లో మళ్లీ భీమిలి నుంచి పోటీ చేయడు కాబట్టే ఈ నియోజకవర్గాన్ని గంటా పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు.

అదిరిన ఆనందపురం
ఆనందపురం అదిరింది. జననేత రాకతో జనసంద్రమైంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో టీడీపీ పీఠాలు కదిలేటట్టుగా ఆనందపురం సభ విజయవంతమైంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మార్కెట్‌ సెంటర్‌లో జరిగిన ఈ బహిరంగసభకు తరలి వచ్చిన జనంతో ఆనందపురం జనసంద్రంగా మారింది. అరకిలోమీటర్‌ మేర ఎటు చూసినా జనంతో నిండిపోయింది. విశాఖ–విజయనగరం, ఆనందపురం–సబ్బవరం రహదారి సైతం జనంతో కిక్కిరిసిపోయింది. పార్టీ కో ఆర్డినేటర్‌ అక్కరమాని విజయనిర్మల, పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావులు పార్టీ శ్రేణుల కృషి ఫలించింది.

మరిన్ని వార్తలు