జెండావందనంలో భార్య.. సీఎం కుర్చీలో బావమరిది

31 Jan, 2018 17:47 IST|Sakshi

నాలుగేళ్ల బాబు పాలనలో ‘చంద్ర’గ్రహణం పట్టింది

రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసేవరకు ఈ గ్రహణం వీడేలా లేదు

ఎమ్మెల్యేలను కొంటూ.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు

ప్రజాసంకల్పయాత్రలో నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌

సాక్షి, పొదలకూరు (పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా) : నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని, ఆకాశంలోని చంద్రగ్రహణం కొద్ది గంటల్లోనే వీగిపోతుండగా.. రాష్ట్రానికి ‘చంద్ర’గ్రహణం మాత్రం.. గ్రామాలు మొదలుకొని రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసేవరకు వీడేలా కనిపించడం లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు బస్టాండ్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఏ స్థాయిలో ఉందంటే.. మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి జెండావందనంలో కనిపించలేదని, ఎక్కడికో వెళ్లారని విమర్శించారు.

‘రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఏ స్థాయిలో ఉందంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి అక్రమ నివాసంలో నివసిస్తూ ఉండగా.. ఆ అక్రమ నివాసంలోనే సీఎం భార్య జెండావందనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళితే.. ఆయన బావమరిది సీఎం కూర్చీలో కూర్చున్నారు. పూజారులు పూజలు చేయాల్సిన దుర్గమ్మ గుడిలో తాంత్రికులు, మాంత్రికులు పూజలు చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా రూ. 20, 30 కోట్లు ఎరవేసి అధికార పార్టీలో చేర్చుకుంటున్నారు. వారితో రాజీనామా చేయించడానికి బదులు.. సిగ్గు లేకుండా మంత్రి పదవులు ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్లే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తే.. అక్రమ బోటులో, లైసెన్స్‌లేని బోటులో సిగ్గులేకుండా తిప్పారు. పుష్కరాల సమయంలో తన షూటింగ్‌ కోసం ముఖ్యమంత్రి అక్షరాల 29మంది ప్రాణాలు బలితీసుకున్నారు’ అని ధ్వజమెత్తారు.

అభివృద్ధి అంటే..
‘అభివృద్ధి అంటే ఏమిటి? చంద్రబాబును ప్రశ్నిస్తున్నా.. నిన్నటి కంటే ఈ రోజు ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటే దానిని నేను అభివృద్ధి అనుకుంటా. కానీ, నాలుగేళ్ల బాబు పాలనలో నిన్నటి కంటే మీరు ఈరోజు సంతోషంగా ఉన్నారా?’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించగా.. లేదు, లేదు అంటూ ప్రజలు చేతులు ఎత్తి ప్రతిధ్వనించారు.

రాష్ట్రం ప్రయోజనాలను తాకట్టు పెట్టారు..!
‘రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఏ స్థాయిలో ఉందంటే.. ఓటుకు కోట్లు ఇస్తూ పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. ముఖ్యమంత్రి అడ్డంగా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారు. నల్లధనం ఇస్తూ ఎవరైనా పట్టుబడితే.. ఉద్యోగంలోంచి పీకేస్తారు. కానీ సాక్షాత్తూ సీఎం దొరికిపోయినా.. ఆయన ఇంకా పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. అది మన రాష్ట్రంలోనే జరుగుతోంది. ‘చంద్ర’గ్రహణం పట్టిన రాష్ట్రం ఈ స్థాయికి దిగజారిపోయింది. ఓటుకు కోట్లు కేసుతో రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేసిన పరిస్థితి వచ్చింది. ఆడియో, వీడియో టేపులతో సీఎం అడ్డంగా దొరికిపోవడంతో కేంద్రం నుంచి హక్కులను గట్టిగా అడిగే పరిస్థితి లేకుండా పోయింది. సీబీఐ విచారణకు భయపడి ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి అమ్మేశారు. ఇదే పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ బాగుందంటూ.. ప్యాకేజీ పేరిట ప్రత్యేక హోదా అమ్మేసినట్టు చెప్పాడు. ఇవాళ నిస్సిగ్గుగా.. ప్యాకేజీ వల్ల ఒక్క రూపాయి కూడా మేలు జరగడం లేదని అంటున్నాడు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

‘రాష్ట్రానికి ఇవాళ చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టిందంటే.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పక్క రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. మన దగ్గర మాత్రం పెట్రోల్‌, డీజీల్‌ రేట్లు బాదుడే బాదుడు. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ లేని రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి’ అని ఆయన అన్నారు. కరెంటు స్వీచ్‌ ఆన్‌ చేస్తే.. కరెంటు బిల్లు చూసి షాక్‌ తినే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఐదువేల కోట్లు చంద్రబాబు బకాయిలు ఉన్నాడని, ఉద్యోగులకు రెండు డీఏలు బాకీ ఉన్నాడని విమర్శించారు. నాలుగేళ్ల బాబు పాలనలో ఏ రైతుకు కూడా, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొందని తెలిపారు. బాబు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రైతుల రుణాలు బేషరతుగా మాఫీ కాగాపోగా.. రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తున్నారని, చంద్రబాబు చేసిన రుణమాఫీ మోసం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని తెలిపారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్న బాబు.. మాఫీ ఏదని ప్రశ్నించిన అక్కచెల్లెమ్మలను పోలీసు స్టేషన్లలో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో అవినీతి మాఫియాను తీసుకొచ్చారని, పెన్షన్లు మొదలు మరుగుదొడ్ల వరకు ఏం కావాలన్న లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారని మండిపడ్డారు.


అరాచక ఆంధ్రప్రదేశ్‌గా, రాజ్యాంగం అమలుకాని ఆంధ్రప్రదేశ్‌..
ఇసుక నుంచి రాజధాని వరకు అన్నింటా లంచాలే లంచాలని, ఈ నాలుగేళ్లలో పర్మినెంట్‌ పేరుతో రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, కానీ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ‘ రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదే. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్‌గా, రాజ్యాంగం అమలుకాని ఆంధ్రప్రదేశ్‌గా, చట్టం అమలుకాని ఆంధ్రప్రదేశ్‌గా బాబు మార్చేశారు. ఎవరి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది’ అని మండిపడ్డారు.

దుగ్గరాజుపట్నం పోర్ట్‌ వస్తే మేలు జరుగుతుందని స్థానికులు ఆశిస్తే.. చంద్రబాబుకు ఆ విషయం పట్టడం లేదన్నారు. పైగా ఇక్కడి పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలిస్తున్నారని దుయ్యబట్టారు. మనం అధికారంలోకి వస్తే 75శాతం ఉద్యోగాలు.. స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేస్తామని తెలిపారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పేవారికి కచ్చితంగా బుద్ధి చెప్పాలని, ఇలాంటి పరిస్థితి, వ్యవస్థ మారాలని, అందుకోసం మీ అందరి ఆశీస్సులు తనకు కావాలని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు