‘బీసీలకు అండగా నిలబడాలన్న తపన వైఎస్‌ జగన్‌ది’

13 Feb, 2019 14:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని బీసీల భవిష్యత్‌కు అండగా నిలబడాలన్న తపన ఉన్న నేత అని ఎమ్మెల్సీ ఆళ్ల నాని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వైఎస్ జగన్.. పాదయాత్ర ప్రారంభంలోనే బీసీల అధ్యయన కమిటీని నియమించి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బీసీ అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. ఏలూరులో ఈ నెల 17న జరిగే బీసీ గర్జన సభను పెద్ద ఎత్తున విజయవంతం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏపీలో బీసీల సంక్షేమాన్ని నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల సమయం కాబట్టే జయహో బీసీ అంటూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు, బీసీలపై ప్రేమతోనే బీసీ గర్జన ఇక్కడ పెట్టాలంటూ వైఎస్ జగన్ నిర్ణయించారని వెల్లడించారు. చంద్రబాబు అబద్ధపు హామీలకు అత్యంత దారుణంగా మోసపోయిన పశ్చిమ గోదావరి బీసీ ప్రజలకు అండగా ఉండాలనే వైఎస్ జగన్ ఇక్కడ సభ పెట్టారని పేర్కొన్నారు. బీసీ వర్గాలపై  చంద్రబాబుకు ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు బీసీలకు కార్పోరేషన్లు ప్రకటించలేదని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు వైఎస్ జగన్‌తోనే మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు