38వ రోజు పాదయాత్ర డైరీ

19 Dec, 2017 01:41 IST|Sakshi

38వ రోజు
18–12–2017, సోమవారం
తనకంటివారిపల్లి శివారు, అనంతపురం జిల్లా.

కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య ఏది?
ఈ రోజు పాదయాత్ర అంతా దాదాపుగా మారుమూల గ్రామాల మధ్యలోంచే సాగింది. ఎత్తు, పల్లం రోడ్ల మీదుగా నడక. మారుమూల గ్రామాలంటేనే గుర్తొచ్చే సమస్యలన్నీ ఇక్కడా ఉన్నాయి. సరైన రవాణా, సమాచార వ్యవస్థలు లేవు. బలహీన వర్గాలు, పేద ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అయినా.. అభిమాన ధనం ఎక్కువే. ప్రేమాభిమానాలకు కొదవలేదు. రాళ్లూరప్పల మీదుగా పరుగులు పెడుతూ వస్తున్న జనాన్ని చూస్తుంటే నాన్నగారు బాగా గుర్తొచ్చారు.

ఆ జనమంతా, ఆ మారుమూల ప్రాంతాల ప్రజలంతా.. నాన్నగారిని ఇంకా తలచుకుంటూనే ఉన్నారు. అందుకు కారణం.. ఆయన హయాంలో ప్రతి సంక్షేమ పథకం లబ్ధి వారిదాకా చేరింది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో చేయూత అందింది. ఆయన మీద తరగని అభిమానంతో, ప్రేమతో ఏలుకుంట్ల గ్రామంలో నాన్నగారి విగ్రహాన్ని పెట్టుకోవాలని గ్రామస్తులు ఎంతో ప్రయత్నించారట. కానీ ఆ ప్రేమను జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు పోలీసుల సాయంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారట. బెదిరింపులతో, దౌర్జన్యాలతో.. గుండెల నిండా ఉన్న ప్రేమను తగ్గించగలరా?

దారిలో గొర్రె పిల్లలను ఎత్తుకుని కొందరు గొర్రెల కాపరులు నా దగ్గరకు వచ్చారు. వారిలో ఒకతను ‘సార్‌.. రూపాయి రూపాయి కూడబెట్టి కొంత, అప్పుచేసి మరికొంత.. కలిపి నూటయాభై గొర్రెలను కొన్నాను. వాటిలో 36 చనిపోయాయి. మేం చాలా నష్టపోయాం. నష్ట పరిహారమంటూ ఏమీ అందలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి గొర్రెలకు బీమా పథకం అమలు చేస్తామని మేనిఫెస్టో సాక్షిగా టీడీపీ ప్రకటించింది.. క్షేత్ర స్థాయిలో చూస్తే ఇదీ పరిస్థితి.

నాకు బాగా గుర్తు.. నాన్నగారి హయాంలో గొర్రెల చెవులకు ట్యాగ్‌ ఉండేది. ఒకవేళ అవి చనిపోతే ఇన్సూరెన్స్‌ వచ్చేది. అది ఆ పేదలకు పెద్ద సాయమయ్యేది. ఇప్పుడు అలాంటిదేమీ లేదట. ఎన్నికల సమయంలో ఆయా కులాల వారికి ఎన్నెన్నో హామీలిచ్చిన బాబుగారు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తకపోవడం బాధాకరం. ఆయా కులాలకు కార్పొరేషన్లని, అవనీ, ఇవనీ చెప్పి.. నెత్తిన టోపీ పెట్టాడన్నమాట.

బిల్వంపల్లి, నేలకోట, ఏలుకుంట్ల, తనకంటివారిపల్లి దాకా సాగిన పాదయాత్రలో పేదరిక పరిస్థితులే ఎక్కువగా కనిపించాయి.. ఆర్థిక సమస్యల కారణంగా తమ పిల్లల చదువులు కుంటుపడతాయేమోనన్న భయాందోళనలూ కనిపించాయి వారిలో. ఈ పల్లెలను, ఈ కుటుంబాలను చూస్తుంటే పిల్లలకు చదువు ఎంత అవసరమో అనిపించింది. పిల్లలు బాగా చదువుకుంటే వారి తలరాతలే కాదు, కుటుంబాల తలరాతలూ మారిపోతాయని నాకు గట్టి నమ్మకం. ఈ రోజు పాదయాత్రలో అదేమాట మరోసారి గట్టిగా చెప్పాను. అక్కడున్న అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి పథకాన్ని వివరించి.. వారి పిల్లలను చదివించే బాధ్యత మన ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చాను.

చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని మీ మేనిఫెస్టోలోని 34వ పేజీలో స్పష్టంగా ప్రకటించారు కదా! పటిష్టంగా అమలు చేయాల్సిన మీరే దానిని పూర్తిగా నీరుగార్చడం నిజం కాదా? పేదలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు.. దానిని అమలుచేయడం గురించి ఈ నాలుగేళ్లలో కనీసం ఆలోచన అయినా చేశారా?

మరిన్ని వార్తలు