టీఆర్‌ఎస్‌తో ఇక కయ్యమే!  | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తో ఇక కయ్యమే! 

Published Tue, Dec 19 2017 1:39 AM

BJP focus on party strengthen at the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై బీజేపీ కయ్యానికి సిద్ధమవుతోంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అదే ఊపుతో తెలంగాణలోనూ విస్తరించాలని కోరుకుంటోంది.  దీనికి అనుగుణంగా రాష్ట్రంలో నాలుగైదు రోజుల పాటు మకాం వేసి, పార్టీ బలోపేతానికి రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జనవరిలోనే అమిత్‌షా తెలంగాణ పర్యటన ఉంటుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీ బలం, బలహీనతలపై జాతీయ నాయకత్వం ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సమగ్ర నివేదికను తెప్పించుకుంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు అవసరమైన మార్గాలను కూడా అన్వేషించినట్టు సమాచారం.

టీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారాలపైనా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ముఖ్యమైన నేతలపై కూడా కన్నేసినట్టుగా తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచి సంఘ్‌తో సంబంధాలున్న నాయకులే ఇప్పటిదాకా బీజేపీలో కీలకపాత్ర పోషించేవారు. అయితే, తెలంగాణలో ఇప్పుడా సంప్రదాయాన్ని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీని విస్తరించే సామర్థ్యం, గెలిచే సత్తా ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడానికి జాతీయ నాయకత్వం ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతలతో ప్రాథమికంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదని సమాచారం. ఇంతలోనే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు రావడంతో చర్చలకు అంతరాయం కలిగిందని బీజేపీకి చెందిన జాతీయ నాయకుడొకరు వెల్లడించారు. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్చలు మళ్లీ జరుగుతాయని తెలిపారు.  

టీఆర్‌ఎస్‌ నేతలపైనే దృష్టి: టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతోనూ అమిత్‌షా టచ్‌లో ఉన్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లోని ఏ స్థాయి నాయకులతో ఆయన మాట్లాడుతున్నారనే విషయంపై వారు స్పష్టత ఇవ్వడంలేదు. కాగా, జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అమిత్‌షా స్థాయిలో చర్చలు జరపాలంటే ఏ పార్టీలోనైనా కీలకంగా ఉన్నవారే అయివుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనవరిలోనే అమిత్‌షా పర్యటన ఉంటుందని, ఇది కీలకం కాబోతోందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. తమ అధ్యక్షుడి దృష్టి అంతా టీఆర్‌ఎస్‌ నేతల చుట్టూనే తిరుగుతున్నదని అంటున్నారు.  

ఎంపీ సీట్ల వారీగా ఇన్‌చార్జీలు: బీజేపీ రాష్ట్ర నేతల మధ్య సయోధ్య, సమన్వయం లేకపోవడం ఇప్పటిదాకా ఆ పార్టీ బలోపేతానికి అవరోధంగా ఉందని జాతీయ నాయకత్వానికి పలు ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. దీనిని అధిగమించడానికి జాతీయ నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగాలనే యోచనకు వచ్చినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికోసం రాష్ట్రంలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జాతీయస్థాయి నాయకుడికి బాధ్యతలు అప్పగించి, బూత్‌స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించాలని నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే సమారు 13 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన మండలస్థాయిలోని రాజకీయ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి, నివేదికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు 5 లోక్‌సభా స్థానాలు, బిహార్‌ మంత్రి మంగళ్‌పాండేకు 4, కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు 4 నియోజకవర్గాల బాధ్యతలను స్థూలంగా అప్పగించింది. రాంమాధవ్‌ ద్వారా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకోగా, మంగళ్‌పాండే ద్వారా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ద్వారా నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్‌ నియోజకవర్గాల ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అమిత్‌షా పర్యటన తర్వాత ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జాతీయనేతను ఇన్‌చార్జిగా చేసి, బూత్‌స్థాయిలో పార్టీ విస్తరణకు వ్యూహం రచిస్తున్నట్టు చెబుతున్నారు.  

Advertisement
Advertisement