‘గోదారి ప్రమాదాలపై ప్రభుత్వం తీరు మారాలి’

19 Jul, 2018 16:15 IST|Sakshi
ప్రమాదం జరగిన ప్రాంతం

సాక్షి, తూర్పు గోదావరి: గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయిన ఘటనలో టీడీపీ ప్రభుత్వం స్పందించిన తీరు దారుణంగా ఉందని వైఎస్సార్‌ సీసీ నేతలు మండిపడ్డారు. హుటాహుటిన సహాయక చర్యలు అందించడానికి లైఫ్‌ జాకెట్లను కూడా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. గోదారిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో టీడీపీ ‍ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గత శనివారం గోదారిలో పిల్లర్‌ను ఢీకొట్టి పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ‍ప్రమాదంలో గల్లంతయిన ఏడుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా మిగతా వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

బాధిత కుటుంబాలను వైఎస్సార్‌ సీపీ నేతలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వేణు, సతీస్‌బాబు, చిట్టిబాబు, రామచందర్‌ రావు, ముని కుమారి, జనార్దన్‌ రావు, నాగేశ్వర రావు తదితరులు గురువారం పరామర్శించారు. వలసల తిప్ప, శేర్లంక, సలాదివారి పాలెం, సీతారామపురం గ్రామాల్లో పర్యటించి మృతుల కుటుంబాలకు 50వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిజేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు