బెదిరింపులకు బెదరొద్దు

24 Feb, 2018 11:27 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

అండగా వైఎస్సార్‌సీపీ ఉంది

నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు(వీఆర్సీ సెంటర్‌): విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు యాజమాన్యం నుంచి, కాంట్రాక్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, అయినా బెదరవద్దని వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌భవన్‌ వద్ద కాంట్రాక్ట్‌ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని మరిచి విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికుల పట్ల సానుకూలంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తే కచ్చితంగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.

అసెంబ్లీలో కూడా కాంట్రాక్ట్‌ కార్మికుల విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎటువంటి పురోగతిలేదన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే అందరికీ ఉద్యోగాలు ఊడిపోతాయని అన్నారు. కడుపు మండి రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్న కార్మికులపై యాజమాన్యం కర్కశంగా ప్రవర్తిస్తే తాము వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పీస్‌రేట్‌ రద్దు, క్రమబద్ధీకరణ వంటి డిమాండ్‌లను నెరవేర్చాలన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించి చెప్పేది చేయడన్న అపవాదును తొలగించుకోవాలని తెలిపారు. డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ మాట్లాడుతూ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఐక్యవేదిక నాయకులు పతంజలి, కృష్ణ, జీవీ శివయ్య, శరత్, సుమన్, బాబు, ఇంతియాజ్, సంజయ్‌లతోపాటు 1100 మంది విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు