అలుపెరగని యోధుడు నాగిరెడ్డి

27 Mar, 2019 12:58 IST|Sakshi

ప్రజల కోసం నిరంతర పోరాటం

గాజువాక బరిలో అభిమాన నేత

విశాఖపట్నం, గాజువాక: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ప్రజల్లో అసాధారణ గుర్తింపు కలిగిన నాయకుడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన ప్రజా సేవ కోసం ఉద్యోగాన్ని వదిలేసిన నేత. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల వాసులను పేరుతో పలకరించగల సమర్థుడుగా ఆయణ్ని ప్రజలు అభిమానిస్తుంటారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగిరెడ్డి ఏ కాలనీకి వెళ్లినా వందల సంఖ్యలో జనం ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. మహిళలు హారతులు పట్టి ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. కాంగ్రెస్‌ పార్టీకి జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే నాగిరెడ్డి కూడా ఆయన వెంట నడిచారు. జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి పిలుపును గాజువాకలో విజయవంతం చేసి ఆయన మన్ననలు పొందారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు అరెస్టులను సైతం లెక్క చేయకుండా ధర్నాలు, బంద్‌లు, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి ప్రజల నిరసనను తెలిపారు.

ఇదీ నాగిరెడ్డి ప్రస్థానం
1953 జూన్‌ 1న జన్మించిన నాగిరెడ్డి ఇంటర్మీడియట్‌ విద్యాభ్యాసంతో 1976లో గ్రామ మున్సఫ్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత గ్రామ పరిపానాధికారి (వీఏవో)గా పదోన్నతి పొంది 1984 వరకు అదే ఉద్యోగంలో కొనసాగారు.
1976లో ఆయన విశాఖ గ్రామ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా, వీఏవో సంఘానికి ప్రధాన
కార్యదర్శిగా పనిచేశారు.
1984లో తెలుగుదేశం ప్రభుత్వం వీఏవో వ్యవస్థను రద్దు చేయడంతో ప్రజా జీవితంలోకి వచ్చారు.
1984 నుంచి 1992 వరకు జిల్లా కాంగ్రెస్‌
కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
ఆ తరువాత ప్రభుత్వం వీఏవో వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించడంతో ఉద్యోగంలో చేరారు. వీఏవో నుంచి వీఆర్వోగా పదోన్నతి పొంది 2005 వరకు పని చేశారు.
అదే సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు.
2007లో జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో ఆయన, తన కోడలు ఎమిలి జ్వాల స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు.
పోరాటమే ఊపిరిగా
కాంగ్రెస్‌ పార్టీలో తన కుటుంబానికి జరిగిన అన్యాయంతో జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే నాగిరెడ్డి కూడా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి తన అనుచరులతో కలిసి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు.
వెఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావం నుంచీ గాజువాకలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, విభజన హామీల సాధనతోపాటు అంతకుముందు రైతు సమస్యలపైన, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం నిర్వీర్యం కావడంపైన, మహిళలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయకపోవడం, నిరుద్యోగ భృతి, ఆరోగ్యశ్రీలను నిర్వీర్యం చేయడానికి వ్యతిరేకంగా పార్టీ పిలుపు మేరకు బహుముఖంగా పోరాటాలు
నిర్వహించారు.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ గాజువాకలో సుమారు 95 రోజులు రిలే నిరాహార దీక్షలను, 4 రోజులు
ఆమరణ నిరాహార దీక్షలను నిర్వహించారు.
ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం గడప గడపకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపులో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లారు. రావాలి జగన్, కావాలి జగన్‌ పేరిట ప్రతి ఇంటికీ వెళ్లి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.

ప్రజల సమస్యలు  ప్రత్యక్షంగా చూశా
నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఇబ్బందులు స్వయంగా విన్నాను. రాష్ట్రానికి హోదా లేకపోవడం, యువతకు ఉద్యోగాలు రాకపోవడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేయడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకపోవడం, పింఛన్ల మంజూరులో టీడీపీ నాయకుల పెత్తనం వల్ల అర్హులకు రాకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఎంతో వేదన పడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నియంత్రణ లేని నిత్యావసర వస్తువుల ధరలు, స్థానిక సమస్యలతో పేదలు, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితులను పరిశీలించాను. వృద్ధులు, వికలాంగులు, వితంతు పింఛన్లు ఆగిపోతుండటంతో తాము ఎన్ని అవస్థలు పడుతున్నామో నాతో చెప్పుకొని కన్నీరు కార్చారు. తమ పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆగిపోవడంతో చదివించుకోవడానికి కష్టాలు పడుతున్నవార్నీ చూశాను. వారికి ఒక్కటే భరోసా ఇచ్చాను. జగనన్న వస్తారని, ముఖ్యమంత్రిగా మీ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పాను. వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిస్తే వైఎస్‌ స్వర్ణయుగాన్ని జగనన్న తెచ్చి చూపిస్తారని హామీ ఇచ్చాను. – తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ గాజువాక అభ్యర్థి

మరిన్ని వార్తలు