లోకేష్‌ సభకు జనం కరువు | Sakshi
Sakshi News home page

లోకేష్‌ సభకు జనం కరువు

Published Wed, Mar 27 2019 1:01 PM

Lokesh Election Campaign In Srikakulam - Sakshi

సాక్షి, పొందూరు/మందస/కొత్తూరు: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ బహిరంగ సభకు స్పందన కరువైంది. పొందూరులో మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు బహిరంగ సభ ప్రారంభమైనా కనీస స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. బహిరంగ సభకు మంత్రి కిమిడి కళావెంకట్రావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు మందస మండలం హరిపురంలో జరిగిన ప్రచారంలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి టీడీపీ అహర్నిశలు కృషి చేసిందని, అందుకే ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు రోజుకు మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రిస్తూ రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నాని చెప్పారు. ఉద్దానానికి కుప్పం తరహాలో శుద్ధజలం అందజేస్తున్నామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి, పోలవరం తదితర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జుత్తు ధనలక్ష్మి, బత్తిన హేమేశ్వరరావు తదితరులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, ఎంపీపీ దాసరి జయలక్ష్మితాతారావు, యార్లగడ్డ వెంకన్నచౌదరి, జీకే నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


లోకేష్‌ ర్యాలీలో జేబుదొంగ..
మంత్రి నారా లోకేష్‌ కొత్తూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో దొంగలు చేతివాటం చూపించారు. హిరమండలానికి చెందిన యువకుడు చాణిక్య తన ఫ్యాంట్‌ వెనుక జేబులో రూ.5వేలు ఉంచగా మరో యువకుడు చాకచక్యంగా తీశాడు. దీనిని గమనించిన చాణక్య యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. దొంగతనానికి పాల్పడినది విశాఖపట్నం సూర్యబాగ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసుల అదుపులో మరో యువకుడు కూడా ఉన్నట్లు తెలిసింది. 

Advertisement
Advertisement