బాబు అలా చెప్పడం విడ్డూరం: పేర్ని నాని

14 Nov, 2018 13:12 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని

విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆశావర్కర్ల సమస్యలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి గుర్తుకు వస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్నినాని విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..గర్బిణీలను ప్రసవానికి తీసుకెళ్లేటప్పుడు కూడా తన గురించి చెప్పాలంటూ ఆశావర్కర్లకు చంద్రబాబు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కంసుడు లాంటి చంద్రబాబు నాయుడి గురించి ప్రతి తల్లీ తన బిడ్డకు వివరిస్తుందని ఎద్దేవా  చేశారు. ఆశావర్కర్లు గతంలో జీతాలు పెంచమని అడిగితే పోలీసు లాఠీలతో కొట్టించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు.

రాజకీయాల్లో మగతనం ఉండదు పవన్‌

తెలంగాణా నాయకులను విమర్శించని వైఎస్‌ జగన్‌కు మగతనం లేదని పవన్‌ విమర్శించడాన్ని పేర్నినాని తప్పుబట్టారు. రాజకీయాల్లో మగతనం ఉండదని, నాయకత్వంతోనే ప్రజల విశ్వాసం పొందాలని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేసి, వారిచ్చే హామీలకు తనది పూచీకత్తు అని, ప్రశ్నించడానికే తాను పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ నాలుగేళ్లు ఎందుకు నిద్రపోయారని ప్రశ్నించారు. ఎన్నికలు ఏడాది ఉండగా పవన్‌ కళ్లు తెరిచారని, పాలక ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అగ్రిగోల్డ్‌, ఫాతిమా కాలేజీ సమస్యలపై పవన్‌ చేసిన ప్రకటనలు ఏమయ్యాయని, వారి పట్ల పవన్‌ కల్యాణ్‌ చేసిన పోరాటం ఏంటో చెప్పాలని సూటిగా అడిగారు. రాజదాని రైతులకు అండగా ఉంటానని చెప్పిన హామీని పవన్‌ గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.

బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌ 

 చంద్రబాబుకు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌ ప్రవర్తిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ రోడ్ల వెంట తిరగడం కాదు..అసెంబ్లీకి వెళ్లాలని పవన్‌ అంటున్నారు..మరి పవన్‌ కల్యాణ్‌ ఎందుకు రోడ్ల వెంట తిరుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో మైక్‌ ఇవ్వకుండా ప్రజా సమస్యల్ని వైఎస్‌ జగన్‌ ఎలా ప్రస్తావిస్తారు.. పవన్‌ కల్యాణ్‌ కూడా బహిరంగ సభల్లో మైక్‌ లేకుండా మాట్లాడాలని హితవు పలికారు. వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ కూడా పవన్‌ కుటుంబంలోని మహిళల గురించి తప్పుగా మాట్లాడలేదని పేర్నినాని తెలిపారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను బండబూతులు తిట్టి తన అవసరాల కోసం, అజ్ఞాతవాసి సినిమా మినహాయింపుల కోసం కేసీఆర్‌ను బ్రతిమిలాడుకున్న చరిత్ర పవన్‌ కల్యాణ్‌దేనని తీవ్రంగా మండిపడ్డారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం వైఎస్‌ జగన్‌కు లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవసరాల కోసమే వైఎస్‌ జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. జనాన్ని హింసిస్తోన్న ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ పోరాడితే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు.
 

>
మరిన్ని వార్తలు